
– తహసీల్దార్, ఎంపీపీ తదితరులకు ఘన సన్మానం
నవతెలంగాణ – ఆమనగల్
సృష్టికి మూలం స్త్రీ అని ఆమె లేకుంటే జననం లేదు, గమనం లేదు, జీవం లేదు, ఆఖరికి ఈ సృష్టే లేదని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కడ్తాల్ మండల కేంద్రములో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సబావత్ బిచ్యా నాయక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా స్థానిక తహసీల్దార్ ముంతాజ్, ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్ తదితరులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. వనిత భూమిపై నడయాడే దేవత వారి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వివక్షకు అడ్డుకట్ట పడ్డనాడే వనిత వంటింటి నుంచి సమాజాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు తహసీల్దార్ ముంతాజ్, ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్ తదితరులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నప్పటికి కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగినవారే తమ సత్తా చాటుతున్నారని వారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, మన్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.