కాంగ్రెస్‌ తీరు వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు : గెల్లు శ్రీనివాస్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి విద్యా శాఖను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారం చేపట్టి నాలుగు నెలుల గడుస్తున్నా విద్యా శాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ శాఖపై సమీక్ష నిర్వహించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ తీరుతో విద్యాశాఖలో సమస్యలు పేరుకుపోతున్నాయని విమర్శించారు. గురుకుల పాఠశాలల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకం భోజనాలు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీచైతన్య, నారాయణ తదితర కార్పొరేట్‌ కాలేజీల్లో ఫీజులు భారీగా పెంచారని తెలిపారు. కోమటి రెడ్డి బ్రదర్స్‌ తమ ఉనికిని కాపాడుకునేందుకు కేసీఆర్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.