ఎస్‌ఎస్‌ఏలకు అందని జీతాలు రెన్నెళ్లుగా అవస్థలు

ఎస్‌ఎస్‌ఏలకు అందని జీతాలు రెన్నెళ్లుగా అవస్థలు–  ఉద్యోగ భద్రత కోసం ఏండ్లుగా కొట్లాడుతున్న ఉద్యోగులు
నవతెలంగాణ- కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు రెండు నెలల నుంచి జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో అప్పుడు నెల జీతం ఆగింది. ఈ నెల జీతం కూడా వారికి అందలేదు. విద్యాశాఖలో కీలకంగా వ్యవహరించే వీరికి వేతనాలు నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్నారు. 15 నుంచి 20 ఏండ్లుగా పని చేస్తున్న ఈ ఉద్యోగులు క్రమబద్దీకరణ కోసం గత ఎన్నికలకు ముందు సమ్మె చేశారు. ఆ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామని మాట ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంపైనే వారంతా ఎదురు చూస్తున్నారు. వేతనాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని సమగ్ర శిక్ష అభియాన్‌లో 2023 లెక్కల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిలో 1971 మంది పని చేస్తున్నారు. ఇందులో డీపీఓ కాంట్రాక్టు స్టాఫ్‌ 29మంది, కేజీబీవీ, యుఆర్‌ఎస్‌లోని టీచింగ్‌, నాన్‌టీచింగ్‌, ఇతర టెక్నికల్‌ స్టాఫ్‌ 1293, ఎంఐఎస్‌ కో ఆర్డినేటర్లు 51, ఎంఆర్‌సీ కంప్యూటర్‌ ఆపరేటర్లు 50, ఐఈఆర్‌పీలు 88, సీఆర్‌పీలు 248, పీఐటీలు 204, ఎంఆర్‌సీ మెసెంజర్లు 47, కేర్‌ గీవర్లు 7, టీఎస్‌ఎంఎస్‌ గర్ల్స్‌ హాస్టల్‌ స్టాఫ్‌ 42 మంది ఉన్నారు. ఇందులో కరీంనగర్‌ జిల్లాలో 555 మంది, సిరిసిల్లలో 425, జగిత్యాల జిల్లాలో 544, పెద్దపల్లి జిల్లాలో 447 మంది పని చేస్తున్నారు. వీరందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 శాతం ప్రకారం జీతాలు మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తమ వాటాను జమ చేయగా, వాటిని వినియోగించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తన వాటాను జమ చేయలేదు. దీంతో రెండు నెలలుగా వేతనాల సమస్య నెలకొంది.
మాట నిలుపుకోని గత సర్కారు
గత సర్కారు హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీ సమావేశాల్లోనే కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉండకూడదని ప్రకటించారు. వనపర్తిలో నిర్వహించిన ఓ సభలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని మాట ఇచ్చి మరిచారు. 40శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగ, అధ్యాపక, వీఆర్‌ఏ, పంచాయతీ సెక్రటరీలను, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నప్పటికీ సమగ్రసర్వ శిక్షలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందించాలని, తమను క్రమబద్ధీకరించాలనే డిమాండ్లతో గతేడాది సెప్టెంబర్లో 20 రోజులకు పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేశారు. నెల రోజులు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ఎదుట రిలే దీక్షలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరడంతో మళ్లీ ఆశలు ఉద్యోగుల్లో చిగురించాయి. ఉద్యోగ భద్రత ఎలా ఉన్నా.. రెండు జీతాలుపడుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి : సీఐటీయూ కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్‌
ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. పెండింగ్‌లో ఉన్న రెండు నెలల జీతాలు వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా చెల్లించి పూర్తిస్థాయిలో ఆ కాంట్రాక్టు ఉద్యో గుల జీతాలు మంజూరు చేయాలి. ఒడిశా, హర్యాన, ఢిల్లీ, మహారాష్ట్రలోనూ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాయి. ఇక్కడ కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికీ ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. సమాన పనికి.. సమాన వేతనం చెల్లించాలి.