నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
ఒక కేసులో నిందితులపై అనుకూలంగా చార్జిషీటు వేయటానికి గానూ రూ.4 లక్షలు డిమాండ్ చేసిన పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను అవినీతి నిరోధక శాఖాధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ రవిగుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట సబ్‌ఇన్‌స్పెక్టర్ జి.పురుషోత్తం ఈ ఏడాది జులైలో హైదరాబాద్‌కు చెందిన గజ్జె రమేశ్‌తో సహా మొత్తం 9 మందిపై ఒక ఘటనకు సంబంధించి కేసును నమోదు చేశారు. కాగా, నిందితుడిపై కేసు నీరుగార్చి చార్జిషీటు వేయటానికి గానూ రూ.4 లక్షలను గతనెల 19న డిమాండ్ చేశాడు. అంతగా తాము ఇచ్చుకోలేమని బాధితుడు ప్రాధేయపడగా లంచాన్ని రూ. 2 లక్షలకు ఎస్సై కుదించాడు. మొదట రూ.1 లక్ష ఇవ్వాలనీ, కోర్టులో చార్జీషీటు వేశాక మరో రూ.1 లక్ష ఇవ్వాలని బేరం కుదుర్చుకున్నాడు. అంతేగాక, తన లంచం డబ్బులు ఇవ్వాలంటూ నిందితులను ఫోన్‌లో, వీడియో కాల్‌లో వేధించాడు. ఈ విషయమై నిందితులలో ఒకడైన గజ్జె రమేశ్.. ఏసీబీకి ఫిర్యాదు చేయగా దానిపై దృష్టి సారించిన అధికారులు ఎస్సై పురుషోత్తంపై క్రిమినల్ మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. లంచాల కోసం పోలీసు శాఖలో ఎవరు డిమాండ్ చేసినా తమకు సమాచారమివ్వాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ రవిగుప్తా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.