– ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
– శాలిగౌరారం ఎస్సైగా సైదులు
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనపై శాలిగౌరారం ఎస్సై వాసా ప్రవీణ్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని గౌరారం గ్రామానికి చెందిన నిఖిల అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తనను లైంగికంగా వేధించిన ఎస్సై వాసా ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని నిఖిల కొద్ది రోజుల క్రితం ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అనంతరం డి ఐ జి కి కూడా ఫిర్యాదును అందజేసింది. అధికారులు ఎస్సై ప్రవీణ్ కుమార్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిఖిల మరోసారి నల్లగొండ ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే లో ఎస్సై పై చర్యలు తీసుకోవాలని మరోసారి ఫిర్యాదు చేయడంతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎస్సై ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు వేశారు. ఆయనను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా సైదులు ను నియమించారు.