ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్టాఫ్ నర్స్ ఫలితాలలో గుండాల మండల కేంద్రానికి చెందిన సాయిప్రియ ఉత్తమ ప్రతిభ కనబరిచి బుధవారం హైదరాబాద్ లో తన నియామక పత్రాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆదివారం భద్రాచలం ఏరియా పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో విధుల్లో చేరడానికి సంబంధిత అధికారికి తన రిపోర్ట్ భద్రాచలంలో అందజేసినట్లు సాయి ప్రియ తెలిపారు. మధ్యతరగతి కుటుంబం
కావడంతో చదువుకునేందుకు అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ తల్లిదండ్రులు బొబ్బిలి రమేష్, పద్మల ప్రోత్సాహంతో చదువు పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే దృఢ సంకల్పంతో భర్త గంగాధరి రఘు సహకారంతో చదివి, స్టాఫ్ నర్స్ ఉద్యోగ ప్రకటన వెలువడగానే దరఖాస్తు చేసి, పరీక్షలు రాసింది. అందులో ఉత్తమ ప్రతిభ చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ నర్స్ ఎంపిక చేసి, నియామక పత్రాలను సాయి ప్రియకు అందించడంతో.. ఆమెతోపాటు తల్లిదండ్రులు, భర్త, బంధుమిత్రులు, గుండాల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయి ప్రియ నవతెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే కల సాకారమైందని, శ్రద్ధగా చదివితే ఎవరైనా ఉద్యోగం సాధించవచ్చన్నారు. నా తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతోనే తాను ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించానని తెలిపారు. ఇష్టమైన నర్స్ ఉద్యోగం రావడం సంతృప్తిగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.