– కలెక్టర్ హరిచందన దాసరి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : లోక సభ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు నియమించిన సిబ్బంది అందరూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన లోకసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాంబర్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు నియమించిన అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా పాటించే ప్రక్రియలను ఒక్కో సిబ్బంది తో వారు చేయవలసిన విధులపై జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు సమర్పించే బ్యాంకు ఖాతా ఫోటోగ్రాఫ్, ప్రతిపాదకులు తదితర అంశాలకు సంబంధించి సూచనలు చేశారు. నామినేషన్లకు సంబంధించి సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నామినేషన్ల కోసం ప్రత్యేకించి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు ఎన్నికల సంఘానికి పంపించే నివేదికలు జాగ్రత్తగా పరిశీలించి పంపించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ లోకసభ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్, ఎన్నికల అనుమతులను ఇచ్చే సువిధ విభాగం, ఎన్నికల వ్యయనిర్వహణకు ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ విభాగాలను తనిఖీ చేసి ఆయా టీముల పని తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ డి.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.