సర్పంచి ఎన్నికల జాప్యంతో గ్రామాలలో కుంటుబడ్డ అభివృద్ధి..

నవతెలంగాణ – ధర్మసాగర్
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీ సర్పంచ్ల పదవి కాలం 2023 వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ముగిసింది. ఈ పదవి కాలం ముగియడంతో వెంటనే సర్పంచ్ ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి గత నాలుగు నెలలుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా కుంటుపడింది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇంటి నిర్మాణ అనుమతులు, స్థిరాస్తుల మార్పిడి అనుమతులు, ఇంటి నీటి పన్నుల వసూల లెక్కల నిర్వహణ కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టే వీలు లేకుండా పోయింది. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయము తగ్గుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధాన ఆరు గ్యారెంటీ హామీలు పూర్తిగా అమలు చేయకపోవడంతో సర్పంచి ఎన్నికలను నిర్వహిస్తే మెజార్టీ సర్పంచి స్థానాలను గెలువ లేము అనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. దీంతో ఎన్నికల నిర్వహణ జాప్యం కారణంగా గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుంది.సర్పంచ్ పదవి కాలాన్ని పెంచాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తుంది.
ప్రభుత్వ పనుల తీరు తో పాటు రిజర్వేషన్లు గత ప్రభుత్వం చేసిన యధాతధంగా ఉంచి ఎన్నికలు నిర్వహిస్తారా,లేదా ఆ రిజర్వేషన్లు కొనసాగించకపోతే ఈ కారణం చేత ఎన్నికల నిర్వహణ పూర్తిగా జాప్యం జరుగుతుందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కేవలం సర్పంచ్ ఎన్నికలు రిజర్వేషన్ల ఆధారంగానే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము 42 శాతం పెంచాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ డిక్లరేషన్ ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ సర్పంచ్ ఎన్నికల నిర్వహణ జాప్యం జరగవచ్చు ఇది ముమ్మాటికి నిజం. దీనిపై కూడా రేవంత్ రెడ్డి  ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకునే అవసరం ఎంతైనా ఉందని చెప్పకనే చెప్పవచ్చు. సర్పంచుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇన్ని సమస్యలు ఉంటే,స్థానిక నేతలు ప్రతిపక్ష నేతలు సర్పంచ్ల ఆశావాహులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్పంచుల ఎన్నికలను సకాలంలో గ్రామాల్లో నిర్వహించకపోవడంతో కార్యదర్శిల మీద సిబ్బందిపై గ్రామాలలో ఉన్న  సమస్యలు పరిష్కరించలేక సరియైన సమాధానాలు చెప్పలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సర్పంచ్ల ఎన్నిక నిర్వాహనకు తగిన ఏర్పాట్లు చేయాలని మేధావులు,రాజకీయ,విశ్లేషకులు,ప్రజలు కోరుతున్నారు.