– పెండింగ్ బిల్లులపై చర్చ
చెన్నయ్ : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన క్యాబినెట్ సహచరులతో కలిసి రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవితో సమావేశమయ్యారు. అపరిష్కృత అంశాలను పరిష్కరించుకునేందుకు గవర్నర్‌తో భేటీ కావాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య సమావేశం జరిగింది. పెండింగ్ బిల్లులు, ఫైళ్లకు ఆమోదం తెలపాల్సిందిగా ముఖ్యమంత్రి మరోసారి గవర్నర్‌ను కోరారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రితో తరచూ సమావేశం కావాలని కూడా ఆయన ఆకాంక్షించారు. కాగా పెండింగులో ఉన్న బిల్లులు, ఫైళ్లపై రాజ్‌భవన్ పెదవి విప్పలేదు. సమావేశం అనంతరం రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎస్.రఘుపతి విలేకరులతో మాట్లాడుతూ ఈ భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగిందని చెప్పారు. అయితే దీని ఫలితం న్యాయస్థానంలోనే తెలుస్తుందని అన్నారు. పెండింగ్ బిల్లులు, ఫైళ్ల వివరాలతో గవర్నర్‌కు స్టాలిన్ ఓ లేఖను అందించారు. రాజ్యాంగ పదవులపై తనకు అపార గౌరవం ఉన్నదని అందులో తెలిపారు. ప్రజలు, ప్రభుత్వ పరిపాలన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇద్దరు మాజీ మంత్రులను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాల్సిందిగా తాము చేసిన అభ్యర్థన రాజ్‌భవన్‌లో పదిహేను నెలలుగా పెండింగులో ఉన్నదని గుర్తు చేశారు. రాష్ట్ర శాసనసభ తిరిగి ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపారని రఘుపతి చెప్పారు.