తిరువనంతపురం : ఫిబ్రవరి 8న న్యూఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు స్టాలిన్‌కు అధికారికంగా ఆహ్వానం అందింది. కేరళ న్యాయశాఖ మంత్రి పి రాజీవ్ చెన్నైలో స్టాలిన్‌తో సమావేశమై విజయన్ తరపున ఆహ్వానాన్ని అందచేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేరళ దాఖలు చేసిన పిటీషన్ గురించి స్టాలిన్‌కు మంత్రి రాజీవ్ వివరించారు. కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షలను వ్యతిరేకించాల్సిన అవసరాన్ని స్టాలిన్ సమర్థించినట్టు ఒక అధికారిక ప్రకటనలో మంత్రి వెల్లడించారు. రాష్ట్రాలపై కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 8న ఢిల్లీలో విజయన్, అతని మంత్రివర్గ సహచరులు, ఇతర ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.