నిలిచిన సొరంగం పనులు

Stalled tunnel works– ఉత్తరకాశీలో ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న అధికారులు
– సొరంగం పైనుంచి నిలువుగా డ్రిల్లింగ్‌ చేయాలని నిర్ణయం
– బతుకు మీద ఆశలు వదులుకుంటున్న కార్మికులు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కుప్పకూలిన సిల్‌క్యారా సొరంగంలో చిక్కుబడిపోయిన వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. అమెరికాకు చెందిన ఆగర్‌ డ్రిల్లింగ్‌ యంత్రం శుక్రవారం ఐదో పైపును అమరుస్తున్న సమయంలో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. పెద్ద శబ్దం కూడా విన్పించింది. యంత్రం ప్రకంపనల కారణంగా సొరంగం పైభాగం నుండి శిథిలాలు పడి ఉంటాయన్న అనుమానంతో పనులు నిలిపేశారు. చివరికి కొండ పై భాగం నుండి కార్మికులు ఉన్న చోటుకు నిలువుగా డ్రిల్లింగ్‌ చేయాలని నిర్ణయించారు.

డెహ్రాడూన్‌ : ముందుగా కొండ పైభాగంలో రంధ్రాన్ని చేస్తారు. దాని ద్వారా బాధితులకు ఆహారం, ఇతర అవసరాలు పంపుతారు. ఆ తర్వాత మూడు అడుగుల రంధ్రం చేసి, కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. అయితే కొండ పైకి డ్రిల్లింగ్‌ యంత్రాన్ని చేర్చడానికి కొంత సమయం పడుతుంది. అందుకోసం రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుండి బోయింగ్‌ రవాణా విమానం ద్వారా మరో డ్రిల్లింగ్‌ యంత్రాన్ని తీసుకొచ్చి, విడిభాగాలను కలిపే పనిలో ఉన్నారు. ప్రధాని కార్యాలయ అధికారులు, నిపుణులు సొరంగం వద్దనే ఉంటూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
ఇక సొరంగంలో కార్మికులు చిక్కుకుపోయి 170 గంటలు దాటిపోయింది. డ్రిల్లింగ్‌ యంత్రం సరిగా పనిచేస్తే మరో రెండున్నర రోజుల్లో కార్మికులను చేరుకుంటామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సంఘటనా స్థలం వద్ద చెప్పారు. లోపల ఉన్న వారికి ప్రమాదమేమీ లేదని ఓ అధికారి తెలిపారు. ‘టన్నెల్‌లో కార్మికులు ఉన్న ప్రదేశంలో నీరు, విద్యుత్‌ ఉన్నాయి. నాలుగు అంగుళాల పైపు ద్వారా వారికి డ్రై ఫ్రూట్స్‌ అందిస్తున్నాం. కొన్ని మందులు…ముఖ్యంగా ఒత్తిడిని అధిగమించే మందులు పంపుతున్నాం’ అని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ చెప్పారు.
అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించకపోవడంతో అటు సొరంగంలో చిక్కుకున్న కార్మికుల్లో, ఇటు వారి కోసం ఎదురు చూస్తున్న బంధువుల్లో ఆందోళన పెరిగిపోతోంది. సొరంగంలో చిక్కుబడిన కార్మికుడి సోదరుడు హరిద్వార్‌ శర్మ బీహార్‌ నుండి ఘటనా స్థలానికి వచ్చారు. కార్మికులు భయాందోళనలతో ఉన్నారని, ప్రభుత్వం మాత్రం వారిలో ఆశలు రేపుతోందని చెప్పారు. ‘నేను నా సోదరుడితో పైపు ద్వారా మాట్లాడాను. కార్మికులు ఆశలు వదులుకుంటున్నారని ఆయన నాతో చెప్పారు. కార్మికులు సొరంగంలోనే మరణించకతప్పదని ప్రకటించాల్సిందిగా ప్రభుత్వ అధికారులకు చెప్పమన్నాడు. అసలు మేము బయటికి వస్తామా రామా అని నన్ను అడిగాడు. నేనేమీ చెప్పలేదు’ అని అన్నారు. ప్రస్తుతానికి ఓ చిన్న పైపు ద్వారా కార్మికులకు ఆహారం పంపుతున్నామని, పెద్ద రంధ్రాన్ని చేసి పైపు ద్వారా మరింత ఆహారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని సహాయ సిబ్బంది చెప్పారు.
సొరంగంలో ఉన్న కార్మికుల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉండవచ్చునని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. లోపల ఉన్న వారి మాటలు చాలా బలహీనంగా, పేలవంగా ఉంటున్నాయని అక్కడికి చేరిన వారు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి నుండి సహాయక చర్యలేవీ జరగడం లేదని ఓ కార్మికుడి తండ్రి సుఖ్‌రామ్‌ తెలిపారు. ‘నేను గురువారం రాత్రి నుండి ఇక్కడే ఉన్నాను. శుక్రవారం రాత్రి పది గంటలకు యంత్రాలన్నీ ఆగిపోయాయి. అప్పటి నుండి సహాయ సిబ్బంది ఖాళీగానే కూర్చున్నారు’ అని ఆయన అన్నారు.