పాలస్తీనా రచయితలకు అండగా నిలవండి

న్యూఢిల్లీ : పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సైనికులు సాగిస్తున్న మారణహోమంపై స్పందించాలని 600 మందికి పైగా రచయితలు, కవులు ‘పెన్‌ అమెరికా’ సంస్థను కోరారు. సాహితీవేత్తల భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. పాలస్తీనాలోని రచయితల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని, వారికి స్వేచ్ఛ లేకుండా పోయిందని కవులు, సాహితీవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో పుస్తకాలను నిషేధించడంలో చూపిన తెగువ, ధైర్యాన్ని పాలస్తీనా ప్రజల విషయంలో కూడా చూపాలని వారు పెన్‌ అమెరికా సంస్థకు సూచించారు. పెన్‌ అమెరికా ఇకనైనా మౌనాన్ని వీడాలని, తనను తాను అభినందించుకునే వైఖరిని విడనాడాలని, జరుగుతున్న మారణహోమంపై వాస్తవ వైఖరిని ప్రదర్శించాలని వారు కోరారు. పాలస్తీనా రచయితలపై గత సంవత్సరం అక్టోబర్‌ 7వ తేదీ నుండి ఆంక్షలు కొనసాగుతున్నాయని, వారి కలాలకు కళ్లెం వేశారని తెలిపారు. వేధింపులకు గురవుతున్న రచయితలకు ఓ వేదికను కల్పించి, వారికి రక్షణగా నిలవలేని పక్షంలో పెన్‌ అమెరికాను రద్దు చేయాలని హితవు పలికారు.