తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. సాంఘిక మాధ్యమాన్ని ఊపేస్తున్నాయి. హిందుత్వశక్తులు, వీరందరి రాజకీయ ముఖమైన బీజేపీ దాని నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అనేక లౌకిక పార్టీలు, లౌకిక మేధావులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన వాదనలను బలపరుస్తుంటే, మరికొందరు స్టాలిన్ వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే బీజేపీకి వ్యతిరేకంగా అఖిల భారత స్థాయిలో కూడుతున్న ఇండియా కూటమిపైకి దాడి చేసే అవకాశం బీజేపీకి ఇచ్చినట్లు అయిందని బాధ వ్యక్తం చేస్తున్నారు. నిజానికి స్టాలిన్ అన్న మాటలు కొత్తవేమీ కాదు. గతంలో అనేక మంది తత్వవేత్తలు, సామాజిక ఉద్యమ కారులు పదేపదే చెప్పిన విషయాల్ని ఆయన చెప్పారు. తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ దోమలు, డెంగ్యూ, మలేరియా లేక కరోనా వైరస్ వంటి వాటిని తుడిచిపెట్టినట్లుగానే సనాతన ధర్మాన్ని కూడా తుడిచి పెట్టాలని, కేవలం వ్యతిరేకిస్తే సరిపోదని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ సోషల్ మీడియా దాడి ప్రారంభించింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా, జెపీ నడ్డా స్థాయి నాయకులు స్టాలిన్ మీద, ఆయన పార్టీ అయిన డీఎంకే మీద, దాని భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్ మీద, వీరందరూ కలిసి నిర్మిస్తున్న ఇండియా కూటమి మీద తీవ్రమైన ఆక్రోషం వెలిబుచ్చారు. ఇండియా కూటమిని ఎలా ఎదుర్కోవాలి అని మల్లగుల్లాలు పడుతున్న బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ హిందుత్వశక్తులు ఈ అంశాన్ని వినియోగించుకోవాలని ఆరాటపడుతున్నాయి.
ఇది అనాదిగా ఉన్న చర్చ
హిందూమతానికి తొలి రూపమైన బ్రాహ్మణ, వైదిక మతాలపైన గౌతమ బుద్ధుడు మూడువేల సంవత్సరాల క్రితమే ఈ పోరాటం ప్రారంభించాడు. బ్రాహ్మణ మత సిద్ధాంతాన్ని చార్వాకులు, లోకాయతులు, సాంఖ్యులు ఇటువంటి అనేకమంది తాత్వికులు తీవ్రంగా వ్యతిరేకించారు. వీరందరినీ భౌతికంగా అణిచివేస్తూ వారి అమూల్యమైన సాహిత్యాన్ని ధ్వంసం చేస్తున్న క్రమంలో హిందూ మతం అనేది రూపం తీసుకుంది. హిందూమతానికి కుల వ్యవస్థకు విడదీయరాని సంబంధం ఉంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధంపై బ్రాహ్మణాధిక్యతను ప్రేరేపించే హిందూ మతం సాగించిన ప్రతీఘాత విప్లవం నుండే పురాతన సమాజాన్ని అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నాడు. ఈ వాదనతో ప్రముఖ మార్క్సిస్టు చరిత్రకారులు రొమిల్లా థాపర్, డిఎన్ ఝా, జైస్వాల్ వంటి వారు ఏకీభవిస్తున్నారు. క్రీస్తు శకం 14వ శతాబ్దం నుండి ఈ బ్రాహ్మణాధిక్య సమాజం సృష్టిస్తున్న మతాధిక్యవాదంపై మరోసారి కెరటంలా వ్యతిరేకత పెల్లుబుకింది. యోగివేమన, పోతులూరి వీరబ్రహ్మం వంటి వారు మన రాష్ట్రంలో, బసవన్న వంటి వారు కర్నాటకలో, రవిదాసు, గురునానక్ వంటి వారు పంజాబ్ ప్రాంతంలో, ఆ తరువాత కేరళలో నారాయణ గురు వంటి వారు కులవ్యవస్థ మీద, దానికి అండగా నిలిచే హిందూ మత భావజాలం పైన పోరాడారు. గురునానక్ కొత్తగా సిక్కు మతాన్ని ప్రారంభించాడు. వీరందరి పోరాటంలో మనకి కనపడేది సనాతన ధర్మాన్ని తెగనాడటమే. ఆ తరువాత 19, 20 శతాబ్దాలలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో మరల మరో కెరటంలా సాంఘిక ఉద్యమాలు వెలువత్తాయి. మహారాష్ట్రలో జ్యోతిబాపూలే, తమిళనాడులో పెరియార్ రామస్వామి, ఆంధ్ర రాష్ట్రంలో త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి వారు అనేకమంది కుల వ్యవస్థ పైన, అందుకు ప్రతిరూపంగా ఉన్న బ్రాహ్మణాధిక్యతపైన బలమైన ఉద్యమాలు నడిపారు. కేరళలో అయ్యంకాళి, దేశవ్యాప్తంగా చూసినప్పుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లాంటి వాళ్లు కుల వ్యవస్థను నిర్మూలించడానికి చేసిన కృషి మన గమనంలో ఉండాలి. క్రీస్తుపూర్వమైనా, మధ్య యుగాలలోనైనా, ఆధునిక కాలంలోనైనా భారత తాత్విక చింతనలో ప్రధాన ఘర్షణ ఈ బ్రాహ్మణాధిక్య మనువాదానికి, నిమ్నజాతుల (శూద్రులు, అతిశూద్రులు) అభ్యున్నతి కోసం నిలబడ్డ తత్వవేత్తలు, సామాజిక ఉద్యమకారుల మధ్యే. కుల దురహంకారులు నాడు నేడు కూడా తమ క్రూరత్వం కనపడకుండా ఉండటానికి ఈ సనాతన ధర్మమనే పదాన్ని చాక చక్యంగా వాడుకుంటూనే ఉన్నారు. అందువలన ఈ చర్చ కొత్తది కాదు, తేడా ఏమంటే గతంతో పోల్చినప్పుడు ఈ మనువాద శక్తులు అనేక రెట్లు బలం పుంజుకున్నాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చాయి. అనేక ప్రభుత్వ సంస్థలని, పరిపాలన వ్యవస్థలని ఆక్రమించుకుంటున్నాయి. ఈ స్థితి నుంచి వారు చేసే దాడి బలంగా, విస్తారంగా ఉంటుంది. అందువలన ఈ శక్తులకు వ్యతిరేకంగా సామాజిక, లౌకిక, ప్రజాతంత్ర శక్తులన్నీ ఒక తాటి మీదకు రావాలి.
హిందుత్వ సిద్ధాంతానికి ఆయువుపట్టు కులమే
అనాదిగా భారతదేశంలో ఉన్నవి హిందూ పురాణాలు, హిందు ఉపనిషత్తులు, హిందూ ధర్మ శాస్త్రాలు తప్ప కుల సాహిత్యం కనపడదు. ఈ హిందూ శాస్త్రాలన్నింటా కుల వ్యవస్థ ప్రస్తావన స్పష్టంగా ఉంటుంది. మనుస్మృతిలో అయితే అచ్చంగా కుల వ్యవస్థ గురించి ప్రస్తావన ఉంటుంది. హిందూత్వ సిద్ధాంతకారులు ఎవరూ మనుస్మృతిని వ్యతిరేకించరు, అడపాదడపా కుల వివక్ష గురించి, అంటరానితనం గురించి మాట్లాడినా మొత్తంగా చూసినప్పుడు. వారికి మనుస్మృతితో విభేదాలు ఉండవు. మనుస్మృతిలో శూద్రుల గురించి, స్త్రీల గురించి ఎంత అమానుషంగా వివరణ ఉంటుందో చూస్తే మన పోరాటం ఎక్కడ మొదలెట్టాలి. దాని దాడి ఎటు ఉండాలి అనేది అర్థమవుతుంది. ”న: శూద్రమతి దద్యత్” అంటే శూద్రులకు (శ్రామికులు) విద్య అందించకూడదు. ”స్త్రీ హి మూల దూషణం” అంటే అన్ని పాపాలకి స్త్రీయే కారణం. ”న: స్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అంటే స్త్రీలకు స్వేచ్ఛ ఉండకూడదు. ఇటువంటివి కోకోల్లలుగా కనపడతాయి. ఇవి క్రీస్తు పూర్వం నాటి వాదనలు. నేటి ఆర్‌ఎస్‌ఎస్ హిందుత్వ శక్తులు ఈ మనువాద సిద్ధాంతాన్నే నెత్తికెత్తుకున్నాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడి తీవ్రంగా పెంచారు. వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పాఠ్యాంశాలని మార్చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బిఎస్సీ నర్సింగ్ కోర్సులో బి.కే. ఇంద్రాణి అనే ఆమె రాసిన పుస్తకాన్ని పాఠ్యాంశంగా పెట్టారు. అందులో వరకట్నం ఇవ్వటం వలన తల్లిదండ్రుల ఆస్తిలో కూతురికి వాటా దొరుకుతుందని, అంద వికారంగా ఉన్న అమ్మాయిలకి ఈ వరకట్నం లేకపోతే పెళ్లిళ్లు అయ్యేవి కావని ఉంది. ఇక అశాస్త్రీయ భావజాలాన్ని… ఆవు మూత్రంలో ఔషధాలు ఉన్నాయని, ఆవు పాలలో బంగారం ఉందని, ఇప్పుడు సైన్సు సాధిస్తున్న విజయాలన్నీ వేల సంవత్సరాల క్రితమే మన రుషులు సాధించేశారని… ఇలాంటి కల్పితాలను బహిరంగంగానే చాటుతున్నారు. ఇంత పచ్చిగా కుల వ్యవస్థని, కులాధిపత్యాన్ని, కుల దురహంకారాన్ని, అశాస్త్రీయతను మతతత్వ శక్తులు పెంచిపోషిస్తుంటే, వాటికి బీజేపీ సర్కార్లు అండదండలిస్తుంటే, ఈ దాడిని తిప్పి కొట్టకపోతే భారతదేశ మనుగడకే ప్రమాదం ముంచుకొస్తుంది.
తాడోపేడో తేల్చుకోవాలి
ఓ పక్క బీజేపీ ప్రమాదాన్ని చెబుతూనే మరోపక్క దానికి ప్రాణవాయువు అయిన హిందుత్వ సిద్ధాంత ప్రచార ప్రమాదాన్ని విస్మరిస్తే తీవ్ర నష్టం జరుగుతుంది. బీజేపీని ఎన్నికల్లో ఓడించడమే కాదు, విషపూరితమైన, అభివృద్ధి నిరోధకమైన, అసమానతలకు పుట్టినిల్లు అయిన హిందుత్వ సిద్ధాంతాన్ని తిప్పికొట్టాలి. వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఘర్షణ నేడు తారాస్థాయికి చేరుకుంది. ఒకనాడు బ్రాహ్మణాధిక్యతను, కుల వివక్షను ఎదుర్కోవడానికి బలం సరిపోని కబీర్ ”ఓ దేవా మనుషుల్లో కొందరిని ఉన్నతులుగా, కొందరిని హీనులుగా పుట్టించిన వాడివి నువ్వు దేవుడెట్లా అవుతావు” అని దేవుడి పేరు మీదుగా భయంకరమైన ఈ సాంఘిక సమస్యని సమాజం ముందుంచారు. మన వేమన కూడా ”పియ్య తినెడి కాకి పితురుడెట్లాయెరా” అని తీవ్రంగా ప్రశ్నించాడు. కేరళలో నారాయణ గురు కూడా శివాలయం కట్టినప్పుడు అగ్రకులాలు దాడికి వస్తే ”ఈ గుడిలో ఉన్నది శూద్ర శివుడు లెండి” అని వాళ్ళని వెనక్కి కొట్టాడు. మన దేశ చరిత్రలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. మనం ఈరోజు 21వ శతాబ్దంలో ఉన్నాము. హిందుత్వ శక్తులు ఎంత బలపడ్డా, ప్రతిగా లౌకికశక్తులు, ప్రగతిశీలశక్తులు, ప్రజాతంత్రవాదులు, దేశభక్తుల సంఖ్య కూడా వాటితో పోల్చినప్పుడు అనేక రెట్లు పెరిగింది. చంద్రయాన్‌కి ముందు పూజలు చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నా, మరో పక్క చంద్రుని మీద మన వాడుకాలు పెట్టాడు. అక్కడ చంద్రుని భార్య తార కనబడలేదు. చంద్రుని మింగేసే రాహుకేతువులు కనబడలేదని, మతతత్వ వాదుల్ని ఎద్దేవా చేసే సామాన్య జనం కూడా ఉన్నారు. ఇప్పటికే మన దేశంలోని సాధారణ జనంలో అత్యధిక భాగం, అందులో ముఖ్యంగా హిందువులుగా చెప్పబడే వారిలో 80శాతం పైగా లౌకికవాదులు. మతసామరస్యాన్ని కోరుకునేవారు. కుల వివక్షతను ద్వేషించేవారు. సరిగ్గా ఈ పరిస్థితే బీజేపీ ఎదుగుదలకి ఒక అవరోధం, దీన్ని అధిగమించడానికి కుల వివక్షని, కుల అంతరాలని, కుల దురహంకారాన్ని ప్రస్తావించకుండా మనమందరం హిందువులం కాబట్టి మన ప్రధాన శత్రువు అయిన ముస్లింలు, క్రైస్తవులు తదితర మతస్తులను ఎదుర్కొందాం రండి అంటున్నది. ”హిందువుగా జీవించు – హిందువుగా గర్వించు” అన్న నినాదాన్ని అందుకే ముందుకు తెచ్చారు. కానీ దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ మైనారిటీల మీదే కాదు, దళితులు, గిరిజనులు, మహిళల మీద కూడా పైశాచిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు చేస్తున్న వారిని బీజేపీ వారు వెనకేసుకు వస్తూనే ఉన్నారు. అందువలన హిందుత్వ సిద్ధాంతాన్ని హిందూ ముస్లింల మధ్య ఘర్షణ సిద్ధాంతంగా, ముస్లింలను, క్రైస్తవులను అణిచివేసి హిందూ రాజ్యస్థాపన చేయడమే వారి ఏకైక లక్ష్యంగా చూడరాదు. హిం దూ రాజ్యమంటే పురాతన కాలంలో వాళ్లు గొప్పగా చెప్పే చాతుర్వర్ణ వ్యవస్థ, దాన్ని బలపర్చే మనువాదం, దాన్ని నిలబెట్టే రాచరిక తరహా పాలన దాని లక్ష్యం. అందుకు వారి దాడి నేడు. ప్రత్యక్షంగా భారత లౌకిక రాజ్యాంగం పైన ఎక్కుపెట్టారు.
ఈ నేపథ్యంలో హిందుత్వ శక్తులపై పోరాటం బలంగా సాగాలి. వాటితో పోలిస్తే నేడు దళిత ఉద్యమం, గిరిజనుల ఐక్యత, మహిళా ఉద్యమాలు, వీరందరికీ ఏదో ఒక మేరకు అండదండలిచ్చే లౌకికశక్తులు విడివిడిగా అయినప్పటికీ బలపడ్డాయి. అలాగే వీరందరినీ కూడదీసే కార్మిక, కర్షక, ఉద్యోగుల ఉద్యమాలు, పోరాటాలు పెరుగుతున్నాయి. వీటికి తోడు బీజేపీని ఓడించాలి అన్న శక్తులు ఒక దగ్గరకు వస్తున్నాయి. ఇవన్నీ అణగారిన ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను ఉపయోగించుకోవాలి. ఏ మాట అన్నా అది బీజేపీకి, హిందుత్వ శక్తులకి ఉపయోగపడుతుందే మోనన్న భయం అర్థరహితం. హిందూత్వ శక్తుల దాడి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ప్రతిదాడి కూడా అన్ని పార్శ్వాలలో తీవ్రంగా ఉండాలి. అందుకు కావలసినంత సాహిత్యం, సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం మనకున్నాయి. బీజేపీ ముందుకు తెస్తున్న అనేక వాదనలను, చరిత్ర వక్రీకరణలను అనేకమంది మేధావులు పూర్వపక్షం చేస్తున్నారు. అన్నింటినీ మించి కుల దురభిమానాన్ని భరించలేని జనం వున్నారు. అందువలన హిందూత్వ శక్తుల విషప్రచారాన్ని స్టాలిన్ వంటి వారే కాదు, ప్రతి భారతీయుడు నిలబడేటట్లు చేయాల్సిన బాధ్యత వామపక్ష ప్రజాతంత్రశక్తుల మీద వుంటుంది.
ఆర్. రఘు
9490098422