మోకాళ్లపై నిలబడి..

– చెవిలో పువ్వులతో నిరసన
– కొనసాగిన గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె
– సమ్మెకు దూదిమెట్ల బాలరాజ్‌ సంఘీభావం
నవతెలంగాణ- విలేకరులు
గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 25వ రోజు ఆదివారం కొనసాగింది. వారికి పలువురు సంఘీభావం తెలిపి అండగా నిలిచారు. యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలంలో జీపీ కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. తుర్కపల్లి మండలంలో సమ్మెకు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ దూదిమెట్ల బాలరాజుయాదవ్‌ సంఘీభావం తెలిపారు. నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలో దున్నపోతుకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. నాంపల్లిలో జీపీ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు సంఘీభావం తెలిపి కార్మికులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. నార్కట్‌పల్లిలో కార్మికులు గుండు గీయించుకుని నిరసన తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 25వ రోజు పంచాయతీ కార్మికుల సమ్మె కొనసాగింది. మంచాల మండల కేంద్రంలో కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సమ్మె శిబిరాన్ని గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్‌ నల్లవెల్లి కురుమూర్తి, ఐద్వా జిల్లా నాయకులు వి.పద్మ సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో కార్మికులు ఆకులు తింటూ నిరసన తెలిపారు.