పూర్తి కాని ప్రాజెక్టును ప్రారంభిస్తారా?

Start an unfinished project?– ఒక్క పంపును ప్రారంభిస్తే ప్రాజెక్టు పూర్తయినట్టా?
– సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ ప్రశ్న
– బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదు
– కాంగ్రెస్‌లో చేరిన సీతా దయాకర్‌రెడ్డి
– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్‌ నేత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఆ ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ ప్రాజెక్టుకు ఉన్న 31 పంపుల్లో కేవలం ఒక్క పంపుతోనే ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదనీ, అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు నుంచి ఎంపీ గెలిచిన తర్వాత ఆ జిల్లాకు చేసిందేంటని కేసీఆర్‌ను ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి వందలాది మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌, మల్లు రవి, డీసీసీ అధ్యక్షులు జి మధుసుధర్‌రెడ్డి తదితరులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ సీతా దయాకర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే దోపిడీ దొంగల కంటే దారుణంగా తయారయ్యారని విమర్శించారు. కాంట్రాక్టులు, కమీషన్లు తప్ప ఎమ్మెల్యేకు దేవరకద్ర అభివృద్ధి పట్టడంలేదన్నారు. నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతలను పడావుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో 14 సీట్లకు 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. సీతక్కను రాజకీయంగా పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. నా రాజకీయ ఎదుగుదలలో కొత్తకోట దయాకర్‌రెడ్డి కుటుంబం నాకు అండగా నిలబడిందని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్సీగా గెలిచేందుకు ఆయన అండగా నిలబడ్డారని తెలిపారు. టీడీపీతో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకున్నప్పుడు(2009)లో ఎంపీగా కేసీఆర్‌ గెలువడంలో ఆయన కీలకపాత్ర పోషించారని చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలకు కాంగ్రెస్‌పార్టీ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.16,17,18న సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, జాతీయ నాయకులు రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ఈ నెల 17న తుక్కుగూడ రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో జరిగే విజయ భేరికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.