– జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానున్న 418 కొనుగోలు కేంద్రాలు
– 3.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంతో కొనుగోలు
నవతెలంగాణ – సిద్దిపేట
జిల్లావ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుండి రాష్ట్రమంతుట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించడంతో జిల్లా అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. హుస్నాబాద్, పోతారం ( ఎస్) , అక్కన్నపేట మండలంలోని జనగామ గ్రామాల్లో మూడు కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుండి ప్రతి మండలంలో ప్రస్తుతం ఒకటైన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, అవసరానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తూ, జిల్లాలో 418 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అందుకు అవసరమాగు బార్ధాన్ ను కూడా ఉన్నదని జిల్లా అధికారులు తెలిపారు. ఈమధ్యనే రాష్ట్ర ఉన్నత అధికారులు జిల్లా కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్షించారు.
3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం : రైతులు పండించిన పంటలో ఈసారి 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు టెంట్ సౌకర్యం, త్రాగునీరు తదితర సౌకర్యాలు ఉండాలని, ధాన్యం కొనుగోళ్లకు కావలసిన గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్స్, తేమ యంత్రాలు, తూకం యంత్రాలు, తదితర ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని, కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా చేపట్టి మిల్లులకు ప్రణాళికాబద్దంగా ధాన్యం చేరవేసేలా రవాణా వ్యవస్థ పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏ గ్రేడు ధాన్యానికి 2203/- బి గ్రేడ్ ధాన్యానికి 2183/- మద్దతు ధరను ప్రకటించింది. తేమ శాతం 17 లోపు ఉండే విధంగా, పొల్లు, తాలు, మట్టి పెలల్లు లేకుండా రైతులు చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు పంపించడానికి రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
దళారులకు అమ్మి మోసపోకండి: తనూజా, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి.
రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలని, దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. తేమ శాతం 17 లోపు ఉండే విధంగా చూడాలి, మట్టి పెలల్లు, తాలు, రాళ్లు లేకుండా చూడాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకొని ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరను పొందాలి. కొనుగోలు కేంద్రంలో వద్ద రైతుల కోసం మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నాం.