– మాట ఇచ్చా.. నిలబెట్టుకున్నా : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
తమ ప్రభుత్వం వచ్చాక ఆటోలను కొండపైకి అనుమతిస్తామని ఎన్నికల ముందు ఆటో కార్మికులకు హామీ ఇచ్చానని, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి కొండపైకి ఆటోల రాకపోకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్టను అభివృద్ధి చేస్తే ఉపాధి దొరుకుతుందనుకుంటే 1000 కుటుంబాల్ని గత ప్రభుత్వం చిందరవందర చేసిందని ఆరోపించారు. వారిలో ఆటో కార్మికులూ ఉన్నారన్నారు.
తనపై నమ్మకంతో పట్టణంలో 80శాతం మంది ఓట్లు వేశారని, వారి రుణం తీర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానన్నారు. అందులో మొదటి అడుగుగా కొండపైకి ఆటోలు వెళ్లడాన్ని తీసుకుంటున్నానన్నారు. కొండపైకి ఆటోలు ప్రారంభం కావడంతో సుమారు 400 కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పారు. దుకాణాలు కోల్పోయిన వారికి 140 మందికి ప్లాట్లు పంచామన్నారు. సందర్శకుల ఇబ్బందులు తీర్చడానికి రూ.20 కోట్లతో డార్మెంటల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. కొబ్బరి కాయ కోట్టేందుకు స్థలాలను ఏర్పాటు చేశామని, టాయిలెట్లు, బాత్రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొండపైన షాపులను పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంత్ జే జెండగె, డీసీపీ రాజేష్‌చంద్ర, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, దేవస్థానం ఈవో రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త నర్సింహామూర్తి, కాంగ్రెస్ నాయకులు అండం సంజీవరెడ్డి, బండ్రు శోభారాణి, జనగాం ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, ఎంపీపీ చీర శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.