– నెట్స్‌లో భారత క్రికెటర్ల ప్రాక్టీస్
– 14 నుంచి ఆసీస్‌తో మూడో టెస్టు
నవతెలంగాణ-ఆడిలైడ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా మారింది. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా.. ఆడిలైడ్ టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా లెక్క సమం చేసింది. ప్రపంచ క్రికెట్‌లో అగ్రజట్లు, సమవుజ్జీల సమరం ప్రస్తుతం 1-1తో రసకందాయంలో పడింది. స్వదేశంలో వెనుకంజ వేసినా.. పుంజుకోవటం కంగారూలకు కొత్త విషయం. కానీ విదేశీ పర్యటనల్లో భారత్ వెనుకంజ వేసినా పుంజుకున్న సందర్భాలు ఎక్కువ. భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు ఈ నెల 14 నుంచి బ్రిస్బేన్‌లో ఆరంభం కానుంది. 2018-19, 2020-21 పర్యటనల్లో ఆసీస్‌పై అసమాన విజయాలు సాధించి సిరీస్ సొంతం చేసుకున్న టీమ్ ఇండియా.. తాజా పర్యటనలో హ్యాట్రిక్‌పై కన్నేసింది. పింక్ బాల్ టెస్టు పరాజయం నుంచి బయటపడిన రోహిత్‌సేన.. మంగళవారం నెట్స్‌లో సాధన షురూ చేసింది.
ప్రాక్టీస్ మొదలైంది
భారత క్రికెట్ విజయావకాశాలను బ్యాటర్లే ఎక్కువగా మోశారు. ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. గెలుపు భారం ప్రధానంగా బౌలర్లపై పడుతోంది. స్వదేశీ, విదేశీ టెస్టులో సంబంధం లేకుండా బ్యాటింగ్ లైనప్ నిలకడగా నిరాశపరుస్తోంది. పేసర్లు, స్పిన్నర్లు మెరిస్తేనే టీమ్ ఇండియా గెలుపు దిశగా సాగుతోంది. ఆడిలైడ్ టెస్టులో బౌలర్లు సైతం అంచనాలను అందుకోలేదు. ఫలితంగా, భారత్ దారుణ పరాజయం చవిచూసింది. సాధారణంగా ఆస్ట్రేలియా గడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల వేట కష్టసాధ్యం. భారత్ సహా ఇతర జట్లు సైతం కంగారూలపై తొలి ఇన్నింగ్స్‌లో తడబాటుకు గురయ్యాయి. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ బలహీనత అధిగమించాలి. అప్పుడే, చివరి మూడు టెస్టుల్లో ఆతిథ్య ఆసీస్‌పై ఒత్తిడి పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఈ బాధ్యతను తీసుకోవాలి. యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ మెరిస్తే ఈ సమస్య నుంచి భారత్ గట్టెక్కటం పెద్ద విషయం కాబోదు.
ఆడిలైడ్ టెస్టు మూడు రోజుల్లోనే ముగియటంతో.. మంగళవారం భారత క్రికెటర్లు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. బ్యాటర్లు, బౌలర్లు అందరూ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ సహా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సందర్‌లు నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేశారు. త్రోడౌన్స్‌లో పేస్, స్పిన్‌ను ఆడారు. విరాట్ కోహ్లితో చీఫ్ కోచ్ గౌతం గంభీర్ మాట్లాడుతూ కనిపించారు. చీఫ్ సెలక్టర అజిత్ అగార్కర్, బౌలింగ్ కోచ్ మోర్కెల్‌లు ప్రాక్టీస్ సెషన్‌ను పరిశీలించారు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు జిమ్ సెషన్‌లో కసరత్తులు చేశారు. శనివారం నుంచి మూడో టెస్టు ఆరంభం కానుండగా.. నేడు భారత జట్టు బ్రిస్బేన్‌కు వెళ్లనుంది!.
షమి వస్తాడా?!
స్టార్ పేసర్ మహ్మద్ షమి ఆస్ట్రేలియాతో టెస్టులకు వస్తాడా? అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమి.. రిహాబిలిటేషన్ ముగించుకుని దేశవాళీ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ తరఫున ఆల్‌రౌండ్ షోతో మెప్పించాడు. దీంతో చివరి మూడు టెస్టులకు మహ్మద్ షమి జట్టులోకి వస్తాడనే అంచనాలను ఎక్కువయ్యాయి. ఆడిలైడ్ టెస్టులో బుమ్రాకు సరైన జోడీ కరువైంది. దీంతో షమిపై అందరి ఫోకస్ నెలకొంది. ‘షమి జట్టులోకి వచ్చి ఆడేందుకు తలుపులు తెరిచే ఉంటాయి. కానీ దేశవాళీ మ్యాచ్‌లో షమి గాయానికి వాపు వచ్చింది. కాస్త నొప్పి కూడా ఉన్నట్టు తెలిసింది. వైద్య నిపుణులు షమి ఫిట్‌నెస్‌ను పర్యవేక్షిస్తున్నారు. అతడిపై ఎటువంటి ఒత్తిడి పెట్టాలని అనుకోవటం లేదు. వైద్య బృందం క్లియరెన్స్ లభిస్తే షమి రాకకు సర్వం సిద్ధంగా ఉంది’ అని రోహిత్ శర్మ అన్నాడు.