మోడీ 3.0 సర్కారు ప్రమాణ స్వీకారానికి ముందే విచ్చుకున్న స్కాముల్లో ‘నీట్’గా జరిగిన ఈ స్కామొకటి. 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కొత్తగా కొలువు తీరిన ఎన్డీయే ప్రభుత్వం చెలగాటమాడుతోంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్‌ఈఈటీ – నీట్)లో జరిగిన భారీ అవకతవకలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఆందోళనకరంగా మర్చాయి. వివిధ కోర్టుల్లో పెద్దఎత్తున దాఖలయిన ఫిటిషన్లు ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
నీట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం లక్షలాది మంది కష్టపడి సిద్ధమవుతుంటారు. తమ జీవితంలోని అత్యంత విలువైన క్షణాలను దీని కోసం వెచ్చిస్తారు. కానీ ఈ పరీక్షల్లో ఏటా పేపర్‌లీక్‌లు, ఫలితాల్లో అక్రమాలు పరిపాటిగా మారిపో యాయి. ఫలితంగా లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్థకంగా మిగిలిపోతోంది. అయినా వీటి పట్ల ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఒకవైపు గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా చేస్తామంటూ కొంత మంది దగ్గర డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైంది మొదలు పరీక్ష నిర్వహణ సక్రమంగా లేదంటూ అనేక వాదనలు వస్తూనే ఉన్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, మేధావులు వీటిపై ఆవేదన చెందుతూనే ఉన్నారు. అయితే నీట్ పరీక్ష నిర్వహించే ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)’ మాత్రం పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న వాదనలను తోసిపుచ్చుతోంది.
నీట్‌లో మొదటి ర్యాంకు సాధించిన 67 మందిలో ఆరుగురు విద్యార్థులు హరియాణాలోని జఝార్‌లోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాశారు. ఆ తర్వాతి రెండు ర్యాంకులు కూడా అదే కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులకే వచ్చాయి. ఎన్‌టీఏ వాదనే నిజమైతే ఇది ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఎన్ని ప్రశ్నలకు, ఎన్ని మార్కులనే లెక్కలకు అంతుచిక్కని రీతిలో కొందరు విద్యార్థులు స్కోర్ సాధించారు. దీనికి ఎన్‌టీఏ వద్ద సరైన సమాధానం లేదు. నిజానికి ప్రతి ఏడాది మొదటి ర్యాంకులు ఇద్దరు ముగ్గురు సాధించడమే చాలా కష్టం. అలాంటిది ఈ ఏడాది ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకులు ఎలా వచ్చాయో ఎన్‌టీఏకే తెలియాలి? ఇంతమంది టాప్ స్కోర్ సాధించడం ఇదే మొదటిసారి. 2023లో ఇద్దరికి మాత్రమే 720/720 మార్కులు వచ్చాయి. ఇక 2022లో ఒక్కరు కూడా పూర్తి మార్కులు సాధించలేదు. ఆ ఏడాది టాపర్లు 720 మార్కులకి గానూ 715 మాత్రమే సాధించగలిగారు. అదేంటో ఈ ఏడాది మాత్రం కొందరికి 718, 719 మార్కులు వచ్చేశాయి. నిపుణులేమో ఇది అసాధ్యమని తేల్చి చెబుతున్నారు.
ఎన్‌టీఏ అవకతవకలకు పాల్పడిందని చెప్పడానికి మరో బలమైన కారణం ఉంది. అదే ఫలితాల ప్రకటన. వాస్తవానికి నీట్ పరీక్షా ఫలితాలు జూన్ 14న ప్రకటిం చాలి. కానీ అంతకంటే 10 రోజుల ముందే జూన్ 4న ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే ప్రకటిం చేశారు. ఎన్నికల ఫలితాల హడావుడిలో ఈ నీట్ అవకతవ కలపై ఎవరూ దృష్టిపెట్టరనుకున్నారేమో! కానీ ఇదే పలు అనుమానాలకు తావిచ్చిందని మేధావులు అంటున్నారు. ఈ విషయంలో విద్యార్థులు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
వీటితో పాటు పేపర్ లీక్ ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే బీహార్‌లో ఇదే విషయమై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 13 మందిని అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు బీహార్ పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అదనపు మార్కుల కేటాయింపు కూడా పారదర్శకంగా జరగలేదని కొందరు భావిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్‌టీఏ మాత్రం అవకతవకలు, పేపర్ లీక్ వంటివేవీ జరగలేదంటూ పదే పదే పాచి పాటే పాడుతోంది. మరోపక్క అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం దీనిపై కనీసం నోరు మెదపడం లేదు. అందువల్ల ఈ అవకతవకల వెనక ఉన్నదెవరో తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఇన్ని అవకతవకలు జరిగిన నీట్ పరీక్షలు రద్దు చేయమంటూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు తలపు తట్టారు. న్యాయం చేయా ల్సిన సుప్రీం కోర్టు ‘కౌన్సెలింగ్ ప్రారంభిం చండి, మేము కౌన్సెలింగ్‌ను ఆపడం లేదు’ అంటూ ప్రకటించింది. ఇప్పుడు విద్యార్థుల వేదన అరణ్యరోదనగా మారిపోయింది.
అంతిమంగా నీట్ పరీక్ష నిర్వహించడం లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమ యిందనేది స్పష్టం. ఇప్పుడు లక్షలాదిమంది విద్యార్థుల భవిత గందరగోళంలో పడింది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడకుండా నీట్ అవకతవకలపై కేంద్రం వెంటనే స్పందించాలి. దీనిపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఇప్పటికైనా ఎన్‌టీఏ చేస్తున్న అవకతవకలను నియంత్రించి, మరింత విశ్వసనీయమైన, సురక్షితమైన పరీక్షా విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.