– గుజరాత్ చేతిలో హైదరాబాద్ చిత్తు
– 126 పరుగుల తేడాతో పరాజయం
నవతెలంగాణ-హైదరాబాద్: రంజీ ట్రోఫీ వేటను హైదరాబాద్ ఓటమితో మొదలెట్టింది. సికింద్రాబాద్‌లోని జింఖాన గ్రౌండ్స్‌లో జరిగిన రంజీ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో హైదరాబాద్ 126 పరుగులతో పరాజయం పాలైంది. 297 పరుగుల ఛేదనలో హైదరాబాద్ చేతులెత్తేసింది. 59.1 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిరాత్ రెడ్డి (51, 59 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో మెరిసినా.. ఇతర బ్యాటర్లు తేలిపోయారు. తన్మరు అగర్వాల్ (1), రాహుల్ సింగ్ (0) విఫలమయ్యారు. రోహిత్ రాయుడు (26), హిమతేజ (29), రాహుల్ రాదేశ్ (17), సివి మిలింద్ (28) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. గుజరాత్ బౌలర్లలో రింకేశ్ (3/52), జడేజా (3/23) మూడేసి వికెట్లు పడగొట్టగా. సిద్దార్థ్ దేశారు (2/47), అర్జాన్ (2/28)లు రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే ఆలౌటైంది. రంజీ ట్రోఫీ రెండో రౌండ్లో డెహ్రాడూన్‌లో ఉత్తరఖాండ్‌తో హైదరాబాద్ తలపడనుంది.