
– స్టడీ సర్కిల్ జాడేది..?
– మైనారిటీ డిక్లరేషన్ ను సైతం విస్మరించడం బాధాకరం
నవతెలంగాణ – పాల్వంచ
గురువారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనారిటీలకు కేవలం రూ.3003 కోట్లను కేటాయించి మైనారిటీలకు నిరాశకు గురి చేశారని గురువారం ఓ ప్రకటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల కన్న మైనారిటీలు నేటి సమాజంలో దీనస్థితిలో ఉన్నారని పలు కమిటీలు నివేదికల్లో పేర్కొనప్పటికి, గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అందుకు భిన్నంగా కేటాయింపులు చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గురుకుల డిగ్రీ కళాశాలలు ఉండగా.. మైనారిటీలకు మాత్రం ఒక్క డిగ్రీ కళాశాల కానీ ఒక్క స్టడీ సర్కిల్ కానీ లేదని చెప్పారు. మైనారిటీ డిక్లరేషన్ ను విస్మరించారని, ప్రభుత్వం మైనారిటీ ప్రజలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. ఈ యేడాది ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్ బడ్జెట్ లో 2262 కోట్లు కెటాయించారని తెలిపారు. రాష్ట్రంలో మైనారిటీ మంత్రిని నియమించని కారణంగా బడ్జెట్ రూపకల్పనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మైనార్టీలకు అభివృద్ధి జరుగుతుందని ఆశించి కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకున్నారని, అందుకు భిన్నంగా బడ్జెట్లో మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మైనార్టీలకు బడ్జెట్లో జరిగిన అన్యాయం పట్ల పునరాలోచన చేసి మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు.