నేడు అశ్వారావుపేటలో పామాయిల్‌ రైతుల రాష్ట్ర సదస్సు

– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
– పామాయిల్‌ రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు
నవతెలంగాణ-వైరాటౌన్‌
పామాయిల్‌ సాగు రైతుల రాష్ట్ర సదస్సు శనివారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో జరుగుతుందని, జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, పామాయిల్‌ సాగు రైతులు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు కోరారు. వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో మల్లెంపాటి రామారావు అధ్యక్షతన జరిగిన రైతు సంఘం విస్తృత సమావేశంలో బొంతు రాంబాబు, చింతనిప్పు చలపతిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేయాలని విస్తృత ప్రచారం చేస్తున్నదని, కాని పామాయిల్‌ ధర అంతర్జాతీయ మార్కెట్లో హెచ్‌ తగ్గులతో ముడి పెట్టడం ద్వారా గతంలో టన్ను పామాయిల్‌ గెలలు 23 వేల రూపాయలు ఉండగా ప్రస్తుతం 13400 రూపాయలకు పడిపోయిందని, విదేశీ దిగుమతి సుంకం 40 శాతం నుంచి 6 శాతం కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వల్ల రైతులకు ధర విషయంలో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీలు సకాలంలో విడుదల చేయడం లేదని, ఎండాకాలంలో అగ్ని ప్రమాదం వల్ల పామాయిల్‌ తోటలు దగ్ధం అవటంతో కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని, పామాయిల్‌ సాగు విషయంలో సమగ్ర విధానం రూపొందించాలని, కనీస మద్దతు ధర టన్నుకు 20 వేల రూపాయలు ప్రభుత్వం నిర్ణయం చేయాలని, పంటల బీమా కల్పించాలని అన్నారు. శనివారం జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వనమా చిన్న సత్యనారాయణ, పామాయిల్‌ రైతులు సంక్రాంతి పురుషోత్తం, వడ్లమూడి మధు, పాసంగులపాటి చలపతిరావు, మాడపాటి మల్లిఖార్జున్‌, రైతు సంఘం నాయకులు హరి వెంకటేశ్వరరావు, బెజవాడ వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.