నిరంతర విద్యుత్ కేసీఆర్ తోనే సాధ్యం-రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

నవతెలంగాణ-భిక్కనూర్
వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సీఎం కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం మండలంలోని రామేశ్వరపల్లి గ్రామంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని, గత పాలకులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలని మాట్లాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 12 గంటల కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఉందని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. దళిత బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశ పెడుతూ రైతులను అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని,తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తో పాటు సంక్షేమ పథకాలు ఓర్వలేక ఇటు బిజెపి అటు కాంగ్రెస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు సాధ్యం కానీ హామీలు ఇప్పటినుండే ప్రజలకు ఇస్తున్నారని, హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతుల ఖాతాలో ఎకరాకు 5000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, పట్టా పాస్ బుక్ కలిగిన ప్రతి రైతుకు రైతుబంధు పథకం అమలు చేయడం జరుగుతుందని, బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న పలు సమస్యలను గ్రామ సర్పంచ్ పోతిరెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు. దశలవారీగా గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ముజీబొద్దిన్, జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ ప్రేమ్ కుమార్, ఎంపీపీ గాల్ రెడ్డి, జెడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, వైస్ ఎంపీపీ యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమంత రెడ్డి, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు నరసింహారెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రామచంద్రం, జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి బలరాం, విద్యుత్ శాఖ దోమకొండ ఏ డి ఏ కిరణ్ చైతన్య, ఏఈ రామలక్ష్మి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ సిద్ధిరాములు, మండల బిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ, సొసైటీ అధ్యక్షులు భూమ్ రెడ్డి, గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షులు అనంత గౌడ్, గ్రామ రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ బాపురెడ్డి, పాల కేంద్రం అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మండల బిఆర్ఎస్ ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ఎంపిడిఒ అనంతరావు, ఎంపిఒ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీపీ సుదర్శన్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.