రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు,రేవంత్ రెడ్డి ల మీటింగ్ రెండు రాష్ట్రాలకు మంచి పరిణామం అని, రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినకుండా చర్యలు ఉండాలని మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం హలియాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిలను, ఉద్యోగుల బదిలీలు, ఏపీలో కలిసిన గ్రామాలపై చర్చ చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని,ప్రధాన రహదారుల విస్తరణ, నదులపై బ్రిడ్జిలు, రెండు రాష్ట్రాల ఆస్తి పంపకాలలో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసి విభజన హామీలను అమలు చేయించాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడంలో, రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించాలని, రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనానికి సీఎం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రాల మధ్య తగువు లు పెట్టే పద్ధతి కాకుండా ఉన్నటువంటి తగువు లు తీర్చే పద్ధతుల్లో కేంద్రం వ్యవహరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కూన్ రెడ్డి నాగిరెడ్డి, చినపాక లక్ష్మీనారాయణ, ఇండియా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, నిడమనూరు మండల కార్యదర్శి కందుకూరి కోటేష్, ఖమ్మంపాటి శంకర్, గోవర్ధనమ్మ, శంకరయ్య, రవి నాయక్, దోరేపల్లి మల్లయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.