– గుప్పుమంటున్న గుడుంబా
– 579 నుంచి 1,874కు పెరిగిన నకిలీ మద్యం కేసులు
– పల్లెలను ముంచెత్తుతున్న చీప్ లిక్కర్
– రోడ్డున పడుతున్న కుటుంబాలు
మద్యం మత్తులో రాష్ట్రం తూగుతోంది. పల్లెలు, పట్టణాల నుంచి మొదలుకుని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం వరకు లిక్కర్ ఏరులై పారుతోంది. 2022 సంవత్సరంలో నకిలీ మద్యం, దేశీదారుకు సంబంధించి 579 కేసులు నమోదు కాగా 2023లో 1,874కు చేరుకుని మూడు రెట్లు పెరిగాయి. గుడుంబా కేసులు రెండు రెట్లు పెరిగాయి. సమయ పాలన లేకుండా ఇష్టారాజ్యంగా మద్యం లభిస్తుండటంతో తాగుడుకు బానిసలయ్యే వారి సంఖ్య భారీగా పెరిగి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదైన 2014లో మద్యం ద్వారా ఖజానాకు రూ. 10,863 కోట్లు సమకూరగా, అ తర్వాత ఏడాది రూ.12,500 కోట్ల మార్కును దాటింది. వరుసగా పెరుగుదల రేటును నమోదు చేసుకుంటూ 2021లో రూ.30 వేల కోట్లు, 2022లో రూ.36 వేల కోట్లకు చేరింది. ఈ రకంగా రాష్ట్ర ఖజానాకు మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. పదేండ్లలో దాదాపు రూ.2.5లక్షల కోట్లకు పైగా ఆదాయం ఈ విభాగం నుంచే సర్కారుకు వచ్చింది. గత ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు లిక్కర్ దందాను పెంచి పోషించింది. ఫలితంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా బెల్ట్ షాపులు విస్తరించాయి. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలుండగా… ఒక్కో గ్రామంలో అనధికారికంగా 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులున్నాయి. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షకుపైగా బెల్ట్ షాపులుంటాయని గణాంకాలు చెబుతున్నాయి. గ్రామాల్లో కిరణా షాపులు, కిళ్లీ కొట్లు, బెల్ట్ షాపులకు నిలయాలుగా మారాయి. మద్యం దుకాణాల్లో ప్రభుత్వం సూచించిన నిర్దేశిత సమయంలో లిక్కర్ అమ్ముతుండగా, బెల్ట్ షాపుల్లో మాత్రం 24 గంటల పాటు అమ్ముతున్నారు.
ఏరులై పారుతున్న నకిలీ మద్యం
రాష్ట్రంలో నకిలీ మద్యం విచ్చల విడిగా వివిధ బ్రాండ్ల పేరుతో సొంతగా తయారు చేయడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. అనధికారిక వ్యక్తులతో పాటు లైసెన్స్ పొందిన లిక్కర్ షాపు యజమానులు సైతం భారీ లాభాల కోసం ఈ బాట పడుతున్నారు. ఫలితంగా ఏది నకిలీదో ఏది అసలైనదో అర్థంకాక మద్యం ప్రియులు మోసపోతున్నారు. 2022 క్యాలెండర్ ఇయర్‌లో నకిలీ మద్యం, దేశీదారుకు సంబంధించి 579 కేసులు నమోదు కాగా 2023లో 1,874 చేరుకుని మూడు రెట్లు పెరిగాయి. 11,396 లీటర్ల మద్యాన్ని 2022లో అబ్కారీ అధికారులు పట్టుకోగా 2023లో 30,296 లీటర్ల లిక్కర్‌ను పట్టుకున్నారు.
ఆగని గుడుంబా విక్రయాలు
రాష్ట్రంలో గుడుంబా విక్రయాలు ఆగడం లేదు. ఎక్సైజ్ శాఖ ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా చాపకింద నీరులా సాగుతూనే ఉంది. తండాలు, పల్లెలు, ప్రధాన నగరాల్లోని మురికి వాడలు, బస్తీలు మొదలగు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు వీటికి గుడుంబాకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. చిన్న చిన్న పాకెట్లలో నింపి యధేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఫలితంగా ఏటేటా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 2022 ఏడాదిలో 9,998 గుడుంబా కేసులు నమోదు కాగా 2023లో 22,274కు చేరుకున్నాయి. 50,239 లీటర్ల గుడుంబాను 2022లో అబ్కారీ శాఖ అధికారులు పట్టుకోగా 2023లో 1,38,039 లీటర్ల గుడుంబాను సీజ్ చేశారు.