ఆదిలాబాద్ లో అట్టహాసంగా ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

– విజేతలకు బహుమతుల ప్రధానం
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
క్రికెట్ తరువాత కబడ్డీని ప్రజలు ఆదరిస్తున్నారని, క్రీడాకారులను ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేల ప్రోత్సహిస్తామని కబడ్డీ సంఘం అంతర్జాతీయ డైరెక్టర్ జగదీష్ యాదవ్ అన్నారు. పట్టణంలోని  ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నాలుగురోజులుగా కొనసాగుతున్న సీనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం ముగిసాయి. ఫైనాల్ మ్యాచ్ సూర్యపేట, నల్గొండ మధ్య జరిగింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో నల్గొండ 36 పాయింట్లు చేయగా… సూర్యపేట 39 పాయింట్లు సాధించి గెలిచింది. కాగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గెలుపొందిన జట్లకు బహుమతులను అందించారు.
కబడ్డికి ఆదరణ రావడం సంతోషకరం
ఈ సందర్భంగా కబడ్డీ సంఘం అంతర్జాతీయ డైరెక్టర్ జగదీష్ యాదవ్ మాట్లాడుతూ… ఒక సమయంలో క్రికెట్ కు అత్యంత ఆదరణ ఉండేదన్నారు. నేడు గ్రామీణక్రీడ అయిన కబడ్డికి ఆదరణ రావడం సంతోషకరమైన విషయమన్నారు. ఇటీవల జరిగిన ఎషియాలో తొలి బంగారు పతకం కబడ్డీ జట్టు దేశానికి అందించిందన్నారు. అదే విధంగా భారత దేశంలో 2036లో జరిగే ఓలంపిక్స్ లో కూడా తొలి బంగారు పతకం కబడ్డి జట్టు అందిస్తుందన్నారు. మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ లాంటి జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పోటీల నిర్వహణ బ్రహ్మండంగా నిర్వహించారన్నారు. ఈ పోటీల నిర్వహణ, వారిలోని పట్టుదల చూస్తుంటే జాతీయ పోటీలను కూడా అవలీలగా నిర్వహిస్తారనే నమ్మకం వస్తుందన్నారు. ఆదిలాబాద్ లో ఉన్న ప్రకృతి అందాలతో పాటు ఇక్కడి క్రీడాకారులు, సంఘం నాయకుల్లో కష్టపడే తత్వం ఉందన్నారు. కబడ్డీలో క్రీడాకారులను ప్రోత్సహిస్తు జాతీయ స్థాయిలో అడేల కృషి చేస్తామన్నారు.
విజయంతంగా పోటీలు
సంఘం సభ్యుల సహకారంతో రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించామని కబడ్డీ అసొసియేషన్ అధ్యక్షుడు ఉష్కం రఘుపతి అన్నారు. నాలుగు రోజుల పాటు 33 జిల్లాల నుంచి క్రీడాకారులకు వసతితో పాటు ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ వేడుక విజయవంతానికి సంఘం ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్ కృషి ఎంతో ఉందన్నారు. జాతీయ స్థాయి పోటీలను నిర్వహించే ధైర్యం వచ్చిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మహేందర్రెడ్డి, ఇండియన్ కబడ్డీ కోచ్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కోశాధికారి రవి కుమార్, జిల్లా అధ్యక్షుడు రఘుపతి, రాష్ట్రపాల్ తదితరులు పాల్గొన్నారు.