రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు

– కెటిఆర్‌ జన్మదినం సందర్భంగా నిర్వహణ
– శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ వెల్లడించారు. ‘తెలంగాణ అభివృద్ది, హైదరాబాద్‌ విశ్వనగర ఖ్యాతి మరింత ఇనుమడింప చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న యూత్‌ ఐకాన్‌ కెటిఆర్‌. ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు పలు క్రీడా సంఘాలు ముందుకు రావటం అభినందనీయం. క్రీడా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలకు శాట్స్‌ సంపూర్ణ సహకారం ఉంటుందని’ ఆంజేయ గౌడ్‌ అన్నారు. జులై 24న కెటిఆర్‌ పుట్టిన రోజు రాష్ట్ర క్రీడా పోటీలు ఫైనల్స్‌ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు గురువారం ఎల్బీ స్టేడియంలోని శాట్స్‌ చైర్మెన్‌ కార్యాలయంలో తెలంగాణ సైక్లింగ్‌, రోలర్‌ స్కేటింగ్‌, రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆంజనేయ గౌడ్‌తో సమావేశమయ్యారు. సైక్లింగ్‌, స్కేటింగ్‌, రెజ్లింగ్‌ (మహిళలు) పోటీల నిర్వహణపై అసోసియేషన్‌ ప్రతినిధులతో శాట్స్‌ చైర్మెన్‌ చర్చించారు. క్రీడా పోటీల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.