పసి పిల్లాడిని వికలాంగుడిగా  కాకుండా కాపాడిన  అత్యాధునిక వైద్యం

– వివరాలు వెల్లడించిన డాక్టర్‌ మనీశ్‌కుమార్‌ జైన్‌
నవ తెలంగాణ – సిద్దిపేట : సైకిల్‌ పై నుంచి కింద పడి బాలుడు తీవ్రంగా గాయపడి చేయి విరిగిపోవడంతో పాటు, నరాలు తెగిపోయి, చేతికి రక్తప్రసరణ ఆగిపోయింది , పల్స్‌ లేకపోవడంతో,  ఇక చేతిని తొలగించడం ఖాయం అనుకున్న సందర్భంలో సికింద్రాబాద్‌ యశోధ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి వికలాంగుడిగా  కాకుండా కాపాడినట్లు వాస్క్యులర్‌ మైక్రో సర్జన్‌  డాక్టర్‌ మనీశ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. మంగళవారం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్లి గ్రామానికి చెందిన ఉడుత రామ్‌చరణ్‌ స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడని,   సైకిల్‌ పై నుంచి కిందపడడంతో చేతికి తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని తెలిపారు.  పరీక్షించిన వైద్యుడు బాలుడి ఎడవ చేతి విరగడంతో పాటు , నరాలు దెబ్బతిన్నట్లు గుర్తించి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారని తెలిపారు. బాలుడిని అతడి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌ యశోధ ఆసుపత్రికి తరలించగా, తనతో పాటు  ఆర్థోపెడిక్‌ విభాగ డాక్టర్‌ పూర్ణచందర్‌ తేజస్వీ, వైద్య బృందం సుమారు రెండు గంటలకు పైగా రిడక్షన్‌ కేవైర్‌ పిక్సేషన్, బ్రేక్‌ ఎ లాటరీ రిపేర్‌ పద్దతుల ద్వారా అత్యాధునిక, అరుదైన శస్త్ర చికిత్సలు నిర్వహించి బాలుడి చేతిని మాములు స్థితికి తీసుకవచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి ప్రతినిధులు రాజిరెడ్డి, నరేందర్, స్థానిక వైద్యుడు సముద్రాల శ్రీనివాస్, చికిత్స పొందిన బాలుడు, అతడి తండ్రి పాల్గొన్నారు.