దివాళా దిశగా రాష్ట్రం

– వంటేరు ప్రతాప్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఆర్థికంగా దివాళ దిశలో వెళుతున్నదని అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మెన్‌, బీఆర్‌ఎస్‌ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌ ఢిల్లీ చుట్టూ తిరగడం, పదవుల కోసం పాకులాడటం, పైరవీలు చేయడం, గత ప్రభుత్వంపై నిందలు వేయడం తప్ప పాలనపై దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.38 వేల కోట్ల అప్పులు తెచ్చి ఒక్క పథకాన్ని అమలు చేయలేదని తెలిపారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు, రైతు భీమా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రతి నెలా ఆదాయం రూ.13 వేల కోట్లు రావాల్సి ఉండగా, గత నెలలో రూ.10 వేల కోట్లు మాత్రమే వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందనీ, ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకుందని చెప్పారు.