– సీనియర్ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దట్టమైన అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 36 మందికి పైగా మావోయిస్టులు చనిపోవటంపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అబూజ్‌మడ్‌లో సాగుతున్న ఎన్‌కౌంటర్‌పై పోలీసు ఉన్నతాధికారులతో రాష్ట్ర డీజీపీ జితేందర్ పరిస్థితిని సమీక్షించారు. మావోయిస్టులకు పెట్టని కోటగా నిలిచిన అత్యంత దుర్భేద్యమైన అబూజ్‌మడ్‌లో ఈ భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవటం, దాంతో ఏదేనీ విపత్కర పరిస్థితులు రాష్ట్రంలో మావోయిస్టుల ద్వారా తలెత్తే అవకాశం ఉన్నదా అనే కోణంలో అధికారులతో డీజీపీ చర్చించినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, ఎస్‌ఐబీ ఐజీ సుమతి, గ్రేహౌండ్స్ అదనపు డీజీ స్టీఫెన్ రవీంద్ర, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్ భగవత్, మల్టీజోన్-1 ఐజీ తరుణ్ జోషి మొదలుకొని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఎస్పీలతో మావోయిస్టుల కదలికలపై డీజీపీ చర్చించారని సమాచారం.
మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున అబూజ్‌మడ్‌లో సమావేశాన్ని నిర్వహిస్తున్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్ కోబ్రా దళం, బీఎస్‌ఎఫ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ యాంటీ నక్సలైట్ విభాగం అబూజ్‌మడ్‌ను చుట్టుముట్టటంతో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నది. ప్రాథమికంగా 36 మంది మావోయిస్టులు మరణించినట్టు పోలీసు వర్గాలు చెప్తుండగా.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం అనుమానిస్తున్నది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నాయక శ్రేణిలోని వారు కొందరు మరణించే అవకాశం కూడా లేకపోలేదని అనుమానిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఈ భారీ ఎన్‌కౌంటర్ కారణంగా రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అధికారులను ఆదేశించారు.