నూతన సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: ఆది శ్రీనివాస్

నవతెలంగాణ – వేములవాడ
శ్రీ క్రోది నామ నూతన సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం వేములవాడ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి రైతు మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం మత్తడి పోచమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ క్రోది నామ సంవత్సరం సందర్భంగా రైతులు తమ పాడి పశువులను పొలంబాట, సాగుబాట పట్టే విధంగా నూతన సంవత్సరం మొదటి రోజున ఎడ్లకు ప్రత్యేకంగా అలంకరణ చేసి నాగాండ్లను కట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ వ్యవసాయ క్షేత్రాలను చదును చేయడం గత కొంతకాలంగా ఆనవాయితీగా వస్తుందని మన ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నూతన సంవత్సరంలో రైతు వర్గంతో పాటు రాష్ట్ర ప్రజలకు అంతే మంచే జరగాలని వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పాడిపంటలతో వర్ధిల్లాలని వేడుకొన్నారు. తెలుగు సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి ఆటంకాలు జరగకుండా కోరుతూ స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు సమపాళ్లలో కొనసాగిస్తూ ముందుకు పోతామన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తే ముందుకు పోతామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, పుల్కం రాజు, కనికరపు రాకేష్, తోట రాజు, చిలక రమేష్ , బైరి సతీష్ పండు, కడారి రాములు ,మహాలక్ష్మి రైతు మిత్ర మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.