కిర్గిస్థాన్‌లో రాష్ట్ర విద్యార్థులు సేఫ్‌

– యోగ క్షేమాలపై సీఎం ఆరా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో తెలంగాణ విద్యార్థులు క్షేమంగా ఉన్నారనే విషయాన్ని అధికారులు ధృవీకరించారు. గత కొద్ది రోజులుగా స్థానికులు భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతు న్నారు. ఆ దాడుల్లో పలువురు గాయపడ్డారని వస్తున్న వార్తలపై సోమవారం ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిష్కెక్‌లోని భారత రాయబారి అరుణ్‌ కుమార్‌ ఛటర్జీని సంప్రదించి వివరాలు సేకరించారు. రాష్ట్ర విద్యార్థులతో పాటు భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారనీ, ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే స్పందించడానికి ఎంబసీ హెల్ప్‌లైన్‌ పూర్తిగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయనీ, వారందరూ చదువులో నిమగమై ఉన్నారని అధికారులు వెల్లడించినట్టు సమాచారం. కాగా ఇప్పటి వరకు భారతీయ విద్యార్థులెవరూ తీవ్రంగా గాయపడలేదని ఇండియన్‌ ఎంబసీ తెలిపింది. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టి పారేసింది.
విద్యార్థులను రక్షించండి : ప్రభుత్వానికి హరీశ్‌ రావు వినతి
గత కొది ్దరోజులుగా కిర్గిస్థాన్‌లో జరుగుతున్న ఘర్షణలో గాయపడుతున్న రాష్ట్ర విద్యార్థులను కాపాడాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్టిట్టర్‌) వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ”కిర్గిస్థాన్‌ రాజధాని బిష్క్‌క్‌లోని భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసాత్మక సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హింసలో పలువురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారు. తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి, విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌, బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయం వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలి” అని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.