– ఎన్నారైలతో జూమ్ మీటింగ్‌లో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మీకు తెలిసిన వారికి చెప్పండి.. తెలంగాణకు బీఆర్‌ఎస్ అవసరం ఎంతుందో అంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. శనివారం 52 దేశాల బీఆర్‌ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో జూమ్ కాల్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రములో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ అనిల్ కుర్మాచలం, గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక, రాక ముందు పరిస్థితులను ప్రవాస భారతీయులు వారి గ్రామస్తులకు వివరించాలని సూచించారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకెళ్లిన విషయాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. మరోసారి దారితప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 50 సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధి వెనక్కి పోతుందని కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ వలన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి 60 సంవత్సరాలు అనేక బాధలకు గురైందని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎన్నారై నాయకులు మహేష్ తన్నీరు తదితరులు పాల్గొన్నారు.