రాష్ట్రవ్యాప్తంగా బోధనా వైద్యుల నిరసన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నల్లగొండ జిల్లా ఆస్పత్రిలో వైద్యుల పనితీరుపై ఇతర విభాగాల అధికారులు పర్యవేక్షించేలా నల్లగొండ కలెక్టర్‌ జారీ చేసిన 45 రోజుల రోస్టర్‌ ఉత్తర్వులకు నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బోధనా వైద్యులు నిరసన తెలిపారు. వివిధ ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి వైద్యరంగంపై ఇతరుల పెత్తనాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిజామాబాద్‌ ప్రభుత్వ బోధనాస్పత్రులతో పాటు 26 వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ప్రభుత్వాస్పత్రుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో టీటీజీడీఏ రాష్ట్ర నాయకులు, నల్లగొండ విభాగం నాయకులతో నల్లగొండ కలెక్టర్‌ చర్చించారు. ఉత్తర్వుల్లో రోస్టర్‌ను సవరించడంతో పాటు వైద్యులకు సంబంధించిన అంశాలను తొలగించారు. ఇతర విభాగాల పర్యవేక్షణను కేవలం మౌలిక వసతుల పరిశీలనకే పరిమితం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడంతో నిరసనను విరమిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం సెక్రెటరీ జనరల్‌ డాక్టర్‌ కిరణ్‌ మాదాల తెలిపారు.