రాష్ట్రాల వారీగానే సర్దుబాట్లు

State wise adjustmentsసీతారాం ఏచూరి ఇంటర్వ్యూ
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల చీలిక వల్ల బీజేపీ ప్రయోజనం పొందకుండా నివారించేందుకు గానూ ప్రతిపక్షాల మధ్య రాష్ట్రాలవారీగా పొత్తులు పెట్టుకోవడంపైనే ఇండియా బ్లాక్‌ దృష్టి కేంద్రీకరించనుంది. భారత రిపబ్లిక్‌ స్వభావాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కి చెందిన పర్వేజ్‌ సుల్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ప్రతిపక్షాల ఓట్లలో చీలిక వల్ల బీజేపీ పొందే ప్రయోజనాలను తగ్గించడానికే ఈ సీట్ల సర్దుబాటు ఆలోచన. ఇండియా ఫోరమ్‌ తదుపరి సమావేశం గురువారం జరగనుంది. ప్రతిపక్షాల ఫోరమ్‌కు కన్వీనర్‌ను నియమిస్తారని, కార్యదర్శివర్గాన్ని ఏర్పాటు చేస్తారని, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తారని వార్తలు వస్తున్నాయి.
ప్రతిపక్షాల ఫోరమ్‌ ముందున్న మార్గం గురించి మీరేం ఆలోచిస్తారు?

ఈ వేదిక ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పుతోంది. అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒక్కచోటకు తీసుకువచ్చిన అంశాలు వున్నాయి. మన రిపబ్లిక్‌ స్వభావాన్ని పరిరక్షించడమనే మౌలిక అంశాలు కూడా ఇందులో వున్నాయి-మనది లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌. రాజ్యాంగం హామీ కల్పించిన హక్కులను కాపాడాల్సి వుంది. అదే మా ప్రాధమిక లక్ష్యంగా వుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే సాధారణంగా కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందుతూ వుంటుంది. ఎన్నికల ముందు ఎప్పుడూ రూపొందలేదు. కానీ, ఇప్పుడు మా ప్రచారం సందర్భంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన కొన్ని ఉమ్మడి సమస్యలు, అంశాలు కచ్చితంగా వున్నాయి. కార్యదర్శివర్గాన్ని ఏర్పాటు చేయడమా లేక మరే ఇతర రకమైన సమన్వయమా అన్నది ముంబయి సమావేశంలో చర్చిస్తాం. కార్యదర్శివర్గాన్ని, కన్వీనర్‌ను లేదా మరి దేన్నైనా ఏర్పాటు చేయడమన్నది అవసరం కాదు. అలయన్స్‌ భాగస్వాముల మధ్య సమన్వయం ఎలా వుండాలో మేం చర్చించనున్నాం.
లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుతున్నారు. కొంచెం వివరించండి….
ప్రతిపక్షాల ఓట్లలో చీలిక వల్ల బీజేపీ పొందే ప్రయోజనాలను తగ్గించడానికే ఈ సీట్ల సర్దుబాటు ఆలోచన. కేరళలో, మేం కాంగ్రెస్‌తో నేరుగా పోరాడుతున్నాం. అక్కడ బీజేపీకి ఒక్క ఎంఎల్‌ఎ కూడా లేరు, ఇక ఎంపీ గురించి ఆలోచనే అక్కర్లేదు. అందువల్ల వామపక్షాలు, కాంగ్రెస్‌ ముఖాముఖి పోరులో వున్నందువల్ల బీజేపీకి వచ్చే ప్రయోజనమేమీ వుండదు. ఎందుకంటే బీజేపీ అక్కడ అస్సలు లేనే లేదు. ఇకపోతే పశ్చిమ బెంగాల్‌లో, బీజేపీకి, టీఎంసీ (తృణమూల్‌ కాంగ్రెస్‌)కి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షాలు, కాంగ్రెస్‌, ఇతర లౌకిక శక్తులు కలిసి బీజేపీని బలహీనపరుస్తాయి. ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి వ్యతిరేకంగా మేమందరం ఒక తాటిపైకి వచ్చామనుకుందాం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ బీజేపీకే వెళతాయి. అలా కాకుండా బెంగాల్‌లో త్రిముఖ పోటీ జరిగినట్లైతే బీజేపీ పొందే లాభం తగ్గుతుంది. అందువల్ల అన్ని రాష్ట్రాలను వేటికవే భిన్నంగా చూడనున్నాం.
సంకీర్ణ భాగస్వాముల్లో కొన్నింటి మధ్య తీవ్ర విభేదాలు వున్నాయి. అటువంటపుడు అన్ని పార్టీలు కలిసి కట్టుగా పనిచేయగలరని మీరు భావిస్తున్నారా?
ప్రజలు మమ్మల్నందరినీ కలిసికట్టుగా వుంచుతారని నేను భావిస్తున్నాను. మమ్మల్ని ఇలా ఒక్క చోటకు తీసుకు వచ్చింది కూడా ప్రజల ఒత్తిడే. ప్రజల తోడ్పాటు కారణంగానే ఎమర్జన్సీ ఓడిపోయింది. అదే కారణంతోనే వాజ్‌పేయి ప్రభుత్వం కూడా ఓటమి పాలైంది. ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. పైగా ప్రజల ఆకాంక్షలను మోసపుచ్చడమనేది ఏ ప్రతిపక్ష పార్టీకైనా చాలా కష్టం కాగలదు.
పార్లమెంట్‌లో సీపీఐ(ఎం) బలం గణనీయంగా తగ్గిపోయింది. అందుకు కారణం ఏమిటి? ఎంపీలను పెంచుకునేందుకు మీరేం చేయాలనుకుంటున్నారు?
ఇందుకు కారణాలు చాలా వున్నాయి. మాకు వ్యతిరేకంగా – అతివాదం నుంచి మితవాదం వరకు – పెద్ద ముఠానే వుంది. అయితే ఇదొక కారణమే. మా వైపు నుంచి కూడా కొన్ని పొరపాట్లు వున్నాయి. ఫలితంగా ఎన్నికల్లో మా పార్టీకి మద్దతు గణనీయంగా క్షీణించింది. అయితే అదే సమయంలో, దేశం ముందు ఒక ఎజెండాను నిర్దేశించగలిగే మా సామర్ధ్యం …ప్రజా ఉద్యమాల ద్వారా ఎజెండాను రూపొందించడం – వాస్తవానికి బలోపేతమైంది. మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటం ప్రధాని మోడీని వెనక్కి కొట్టింది. ఆ మూడు వివాదాస్పద బిల్లులు ఉపసంహరించుకున్నారు…కేవలం ఉద్యమాల వల్లనే ప్రధాని వాటిని ఉపసంహరిచుకోవాల్సి వచ్చింది. కేవలం మా ఉద్యమాల ద్వారా కార్మిక వర్గం చేస్తున్న పోరాటం కారణంగానే ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ క్రమంలో జాప్యం జరుగుతోంది. అందువల్ల, ప్రజా ఉద్యమాల ద్వారా జాతీయ ఎజెండాను రూపొందించడం వామపక్షాల పాత్రగా వుంది. అయితే, ఎన్నికల పరంగా చూసినట్లైతే మీరంటున్నది నిజమే. దాన్ని సరిదిద్దుకోవాల్సి వుంది. దానిపైనే మేం కృషి చేస్తున్నాం.
మీరు ఇటీవల మణిపూర్‌లో పర్యటించారు. ఒక వర్గం ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని డిమాండ్‌ చేసే పరిస్థితి ఎలా వచ్చింది ?
అక్కడ పరిస్థితి భయంకరంగా వుంది. నా జీవితంలో దేశంలో మరెక్కడా కూడా ఇలాంటి పరిస్థితులను చూడలేదు. నిజానికి ఒక రాష్ట్రంలో రెండు దేశాలు వున్నాయి. మెయితీలు, కుకీలు నివసించే రెండు ప్రాంతాలకూ వెళ్లాం. మెయితీ పక్షం నుండి కుకీ ప్రాంతంలోకి మీరు వెళ్లాలనుకుంటే మెయితీలు ఎవరినీ మీతో అనుమతించరు. కుకీ ప్రాంతాల్లో పర్యటించేటపుడు మెయితీ అయిన మా పార్టీ కార్యదర్శినే మేం అక్కడ వదిలివేయాల్సి వచ్చింది. అలాగే మెయితీ ఏరియాలోకి వెళ్లాలన్నా కూడా ఇదే పరిస్థితి. రెండు వేర్వేరు ప్రాంతాలు అవి. నిజానికి అక్కడ యుద్ధం తరహా పరిస్థితి నెలకొంది. ఒక వైపు నుండి ఇంకో వైపునకు మీరు వెళ్లానుకుంటే మూడు స్థాయిల్లో అడ్డగించడాలు వుంటాయి. అవన్నీ చేసేది భద్రతా బలగాలు కాదు, స్థానికులే.
ప్రజలు, సమాజం పట్ల ఒక తరహాలో అమానుషంగా వ్యవహరించడం ఆ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ జాతుల ఘర్షణలను సృష్టించడంలో ‘డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌’ (కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే వుండడం) ది చాలా పెద్ద పాత్ర. ఎన్నికల్లో కుకీ మిలిటెంట్‌ గ్రూపులకు మద్దతిచ్చింది. అసోం ముఖ్యమంత్రితో, ఈశాన్య ప్రాంత బీజేపీ ఇన్‌చార్జితో తమకు ఒప్పందం వున్నట్లు వారు (కుకీలు) చెబుతున్నారు. తాము బీజేపీకి మద్దతివ్వడం వల్లనే మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బీరేన్‌ సింగ్‌ వున్నారని కుకీ మిలిటెంట్లు చెబుతున్నారు.
పది మంది కుకీ ఎంఎల్‌ఎల్లో ఏడుగురు బీజేపీకి చెందినవారే, వారిలో ఇద్దరు మంత్రులు. అయితే, కుకీలందరూ మయన్మార్‌ నుంచి అక్రమంగా వచ్చిన శరణార్ధులేనని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రి కూడా లోక్‌సభలో ఇదే విషయాన్ని చెప్పారు. దాంతో ఆనాడు ఎన్నికల్లో గెలుపొందడానికి మా మద్దతు కోరి ఇప్పుడు తమను అక్రమ శరణార్ధులుగా, నార్కో తీవ్రవాదులుగా పిలుస్తున్నారని కుకీలు విమర్శిస్తున్నారు.
ఇప్పుడు నాగాలు కూడా రంగంలోకి వచ్చారు. నాగాల భూమిలో ఈ హింస జరుగుతోందని వారంటున్నారు. నాగా ఒప్పందానికి, మణిపూర్‌లో భూమికి చాలా సంబంధం వుంది. మంటలు ఆర్పకపోయినట్లైతే, పరిస్థితులు వారి (ప్రభుత్వం) నియంత్రణ నుంచి చేదాటి పోతాయి. మిజోరాం కూడా ప్రభావితమవుతుంది. ఈ సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరించని పక్షంలో, మొత్తంగా ఈశాన్య ప్రాంతమంతా ఇది విస్తరించే అవకాశం వుంది. సహాయ శిబిరాల్లో పరిస్థితులు – అది ఆహారం కానివ్వండి లేదా పారిశుధ్యం కానివ్వండి – చాలా భీతిగొలిపేలా వున్నాయి. అక్కడ పుట్టే పిల్లలకు ఎలాంటి వ్యాధి నిరోధక కార్యక్రమాలు వుండవూ, పోషకాహారమూ వుండదు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ?
అక్కడ 60వేల మంది కేంద్ర భద్రతా బలగాలు వున్నాయి. కానీ ఏం చర్యలు చేపట్టాల్సిన అవసరముంది అన్న విషయంలో వారికెలాంటి ఆదేశాలు లేవు. వారికి గనక ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లైతే, చాలా వరకు హింసను అదుపు చేయగలుగుతాం. మణిపూర్‌లోని ప్రతి ఒక్క వర్గానికి చెందిన వారిని కలుసుకునేందుకు కేంద్ర హోం మంత్రి నాయకత్వంలో ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలి. వారి సాధకబాధలు వినాలి, వారి ఆకాంక్షలకు తగినట్లుగా పరిష్కారాన్ని రూపొందించేందుకు ప్రయత్నించాలి. మొదటి రోజు నుంచీ మేం ఇదే చెబుతూ వస్తున్నాం. మూడుసార్లు కాశ్మీర్‌కు వెళ్ళిన అటువంటి ప్రతినిధి బృందంలో శివరాజ్‌ పాటిల్‌, పి.చిదంబరం, రాజ్‌నాథ్‌ సింగ్‌లతో కలిసి నేను కూడా వెళ్ళాను. ఈ మూడు సందర్బాల్లోనూ, కొన్ని పరిష్కారాలు రూపొందించే దిశగా మేం ప్రయత్నించాం. ఇప్పుడు, ఇక్కడ అదే పనిని వారు (ప్రభుత్వం) ఎందుకు చేయడం లేదు ?