దేశ పౌర గ్రంథాలయాల స్థితిగతులు

డా||రవికుమార్‌ చేగొని భారత జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్‌ 14 నుండి 20 వరకు నిర్వహిస్తారు. భారత జాతీయ ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి పౌర గ్రంథాలయాలలో, విద్యా గ్రంథాలయాలలో వారం రోజులపాటు తమ దగ్గర ఉన్న పుస్తక వనరులను ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి గ్రంథాలయాలకు పాఠకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అయితే దేశంలో పౌర గ్రంథాలయాల వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పౌర గ్రంథాలయాలు మేధో వికాసాన్ని ప్రోత్సహించే, ప్రజల ఆలోచనలను విస్తరించే కమ్యూనిటీ హబ్‌లుగా కీలక పాత్ర పోషిస్తున్నాయి.
సమాచారాన్ని ప్రజలకు అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని పౌర విశ్వ విద్యాలయాలుగా పరిగణిస్తారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల చదువరులకు సమాచార అంతరాన్ని తగ్గించడంలో, గ్రంథాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇంత సాంకేతిక పరిజ్ఞాన ప్రపంచంలో, ఇంటర్నెట్‌ సౌకర్యం, సాంఘిక మాధ్యమాల హోరులో కూడా సమాచారాన్ని అందరికీ అందించే విజ్ఞాన కేంద్రాలుగా పౌర గ్రంథాలయాలు వర్ధిల్లుతున్నాయి.
పౌర గ్రంథాలయాలకు ఆర్థిక వనరుల కేటాయింపు తగ్గుదల, అర్హత వున్న గ్రంథ పాలకులు లేకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం, తగిన పుస్తక వనరులు లేకపోవడం, ఉన్నా అవి ప్రస్తుత చదువరులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా లేవా?… ఇలాంటి సమస్యలు పౌర గ్రంథాలయాలు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నాయి.
వాస్తవానికి దశాబ్దాల తరబడి గ్రంథాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలు జటిలమైనవే కానీ తీర్చలేనివి కావు. పౌర గ్రంథాలయాల వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి గ్రంథాలయాలకు సహాయం చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. వాటిలో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ పబ్లిక్‌ లైబ్రరీస్‌ ఒకటి. ఇది పౌర గ్రంథాలయాలను ఎలా అభివద్ధి చేయాలి? క్షేత్రస్థాయిలో వీటి సేవలను ఎలా విస్తరించాలనే విషయాలతో పాటు పాఠశాలలో మెరుగైన విద్యను ప్రణాళికల ద్వారా అభివద్ధిచెందడానికి పాఠశాల గ్రంథాలయాలు కూడా అవసరమని చెప్పింది.
రాజారామ్‌ మోహన్‌రారు లైబ్రరీ ఫౌండేషన్‌ పౌర గ్రంథాలయాల అభివద్ధికి ఆర్థికసహాయ సహకారాలు (పుస్తకాల కొనుగోలుకు, భవన నిర్మాణాలకు), గ్రంథాలయాలలో పనిచేసే గ్రంథ పాలకులకు వ్యక్తిగత వద్ధి, వత్తిపరమైన పురోగతిపై దష్టి సారించే ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌, జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి సెమినార్లు, వర్క్‌ షాప్‌లకు లైబ్రరీ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక పౌర గ్రంథాలయాలకు మౌలిక వసతులకు, పుస్తక వనరులకు, భవన నిర్మాణాలకు సహాయ సహకారాలు అందించి చదువరులకు విస్తత సేవలు అందించే ప్రయత్నం చేస్తుంది.
‘బీఎ పాలసీ రివ్యూ ఆఫ్‌ పబ్లిక్‌ లైబ్రరీస్‌ ఇన్‌ ఇండియా’ అనే పరిశోధనలో పౌర గ్రంథాలయాలు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని సుదీర్ఘంగా చర్చించారు. దురదష్టవశాత్తూ దేశంలో చాలా రాష్ట్రాలు పౌర గ్రంథాలయాలు నిర్వహించడానికి ఒక చట్టం కానీ, ప్రామాణిక ప్రమాణాలను కలిగి లేవు. ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విజ్ఞాన ప్రపంచంలో నాలెడ్జ్‌ హబ్‌లు ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అనుకున్నంత ఫలితాలు కనబరచలేకపోతున్నాయి. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే వాటిలో 20 రాష్ట్రాలు మాత్రమే పౌర గ్రంథాలయాల చట్టాలను ఏర్పాటు చేశాయి. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు. గ్రంథాలయాలంటే ప్రభుత్వాలకు పట్టని వ్యవస్థగా, జవాబుదారీతనం లేకపోవడం, స్థానిక సంస్థలు, నగర కార్పొరేషన్‌, గ్రామ పంచాయితీలు గ్రంథాలయ పన్నులు చెల్లించని పరిస్థితి వుంది. అయితే హైదరాబాద్‌ నుండి దాదాపు వెయ్యి కోట్ల పైచీలుకు, ముంబై నుండి 450 కోట్లు, బెంగళూరు నుండి 350 కోట్లు పౌర గ్రంథాలయాలకు చెల్లించవలసిన ఉన్నది. మిగతా మహా నగరాల పరిస్థితి సరే సరి.
ప్రస్తుతం సమాజంలో గ్రంథాలయాలు నిత్యావసర వస్తువులుగా మారాయి. వీటి స్థాపన ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు, ప్రైవేట్‌ వ్యక్తుల తోడ్పాటుతో ఏర్పాటు జరుగుతున్నది. ప్రస్తుతం గ్రంథాలయాలు పోటీ పరీక్షల కేంద్రాలుగా విద్యార్థులను నిరుద్యోగ యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. పుస్తక పఠన కేంద్రాలుగా మాత్రమే ఉన్నాయి. మహిళలు, పిల్లలు, వద్ధులు ఈ గ్రంథాలయంలో సేదతీరి వారి కావలసిన సమాచారాన్ని తీసుకునేందుకు ఎప్పుడు మక్కువ చూపుతారో అప్పుడే ఈ గ్రంథాలయాలు ఇంకా ఎక్కువగా జనాకర్షణ పొందే అవకాశం ఉంది.
పుస్తక వనరులు: ప్రస్తుతం పౌర గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న పుస్తకాలు అవసరానికి తగ్గట్టుగా లేకపోవడం శోచనీయం. 2017 ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లైబ్రరీ అసోసియేషన్స్‌ అండ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ నివేదిక ప్రకారం ‘ది వరల్డ్స్‌ పబ్లిక్‌ లైబ్రరీస్‌: కీ ట్రెండ్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌’ ఒక సగటు భారతీయ పబ్లిక్‌ లైబ్రరీలో కేవలం 5,700 పుస్తకాలు ఉన్నాయి. అభివద్ధి చెందిన దేశాలలో పుస్తకాల సంఖ్య 108,000. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పుస్తకాల కొనుగోలు సేకరణ జరగాలి అందుకు తగిన ఆర్థిక వనరులు కూడా సమకూర్చుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సేవలందించే గ్రంథాలయాలు బహు స్వల్పం. 2022 ప్రకారం యునెస్కో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ రిపోర్ట్‌ ‘మెజరింగ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌’ ప్రకారం కేవలం 12 శాతం భారతీయ పబ్లిక్‌ లైబ్రరీలలో కంప్యూటర్లు ఉన్నాయి. కేవలం 8 శాతం మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి.
అధిక ప్రయోజనాలను పొందేందుకు అందుబాటులో ఉన్న వనరులను అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి, పబ్లిక్‌ లైబ్రరీలు ఒకదానితో ఒకటి తమ సంబంధాలను (గ్రామీణ గ్రంథాలయాల నుండి మండల గ్రంథాలయాలు, జిల్లా గ్రంథాలయాలు, రీజనల్‌ గ్రంథాలయాలు, రాష్ట్రస్థాయి గ్రంథాలయాలు, జాతీయస్థాయి గ్రంథాలయాలు) బలోపేతం చేసుకోవాలి. అందుకోసం పౌర గ్రంథాలయాల నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది.
ఒడిస్సా రాష్ట్రంలో గ్రామోథన్‌ కార్యక్రమం కింద ఉచిత కమ్యూనిటీ గ్రంథాలయాలు గత సంవత్సరం 12 వందలు ప్రారంభించింది. గ్రామోథన్‌ ద్వారా పౌర గ్రంథాలయాలకు, నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ గ్రంథాలయాలకు ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి అందరూ సమానంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది.
పట్టణ ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటీల్లో, పార్కుల్లో, కాఫీ షాపుల్లో, బస్టాండ్‌ – రైల్వే స్టేషన్‌లలో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది శుభ పరిణామం. కానీ గ్రామీణ ప్రాంతాలలో గ్రంథాలయాల ఏర్పాటు, వాటి నిర్వహణ అనుకునేంత స్థాయిలో లేకపోవడం దురదష్టకరం. జ్ఞానం అనేది సంపన్నులకు మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులో వుంచాల్సిన బాధ్యత పౌర గ్రంథాలయాల పై ఉన్నది.
ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్‌ 2022 ప్రకారం జాతీయ వ్యాప్తంగా పౌర గ్రంథాలయాల భవనాలు కూడా అనుకున్న స్థాయిలో లేవు. 48 శాతం పౌర గ్రంథాలయాలకు పక్కా భవనాలు, సొంతభవనాలు కలవు. 52 శాతం అద్దె భవనాలలో, కత్రిమ భవనాలలో సేవలందిస్తున్నాయి. అదేవిధంగా గ్రంథపాలకుల గురించి వివరిస్తూ 46 శాతం మాత్రమే గ్రంథపాలకులు పౌర గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు. మిగతా 24 శాతం పొరుగు సేవలు, ఒప్పంద, అర్హత లేని గ్రంథ పాలకుల నిర్వహణలో వున్నాయి.
30 శాతం లైబ్రేరియన్‌ ఉద్యోగాలు ఖాళీలు ఉండడం విశేషం. పౌర గ్రంథాలయాల ఉన్నతికి సమగ్ర సేవలు అందించేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నాయి. వాటిలో రూరల్‌ లైబ్రరీ ఫౌండేషన్‌, రూమ్‌ టు రిడ్‌, ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్‌, భారతదేశ గ్రంథాలయ సంఘం, ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం, తెలంగాణ గ్రంథాలయ సంఘం ఇలా అనేక స్వచ్ఛంద సంస్థలు గ్రంథాలయాల ఉన్నతికి పని చేస్తున్నాయి.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, జపాన్‌, జర్మనీ, కెనడా, సింగపూర్‌ దేశాలలో జనాభా ప్రాతిపాదికన లైబ్రరీలు ఏర్పాటు చేశారు. వాటితోపాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగి నూతన హంగులతో అర్హత కలిగిన లైబ్రేరియన్‌లు సమాచారం అందిస్తున్నారు. వాటికి కావలసిన ఆర్థిక వనరులు ప్రభుత్వం, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. అందుకే అమెరికాను గ్రంథాలయాల స్వర్గం అని పిలుస్తారు. కారణం ఆ దేశంలో వున్నన్ని పౌర గ్రంథాలయాలు (జనాభాకు అనుగుణంగా) మరే దేశంలో లేవు. ఆ దేశం ఏర్పాటు చేస్తున్న పౌర గ్రంథాలయాలు, అందిస్తున్న సేవలు, పుస్తక వనరులు, మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి.
ఆ దేశాల ప్రజలు పౌర గ్రంథాలయాలను తమ సొంతవిగా భావిస్తారు. అలా అనుకోవడం వల్ల గ్రంథాలయాల వినియోగంతో పాటు వాటి అభివద్ధితో పాటు ఆదరణ, నిర్వహణ కూడా అదే స్థాయి ఉంటుంది.
పౌర గ్రంథాలయాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, సామాజిక అసమానతలను సమం చేయడంలో, పౌరులకు – ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా ముఖ్యపాత్రను పోషిస్తాయి. లైబ్రరీలపై నేషనల్‌ మిషన్‌ ఇటీవల విడుదల చేసిన సర్వేలో పౌర గ్రంథాలయాల సభ్యులలో పిల్లలు, వికలాంగులు లేరని తేలింది. మహిళా సభ్యుల సంఖ్య, వద్ధుల సంఖ్య కూడా చాలా తక్కువే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పౌర గ్రంథాలయాల సభ్యులు 82% యువత, 18% మాత్రం మహిళలు పిల్లలు వద్ధులు ఉన్నారని తెలిపింది. పౌర గ్రంథాలయం అంటే సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేవిధంగా వనరులు సమకూర్చాలి.
అత్యధిక సంఖ్యలో పౌర గ్రంథాలయాలు కలిగి ఉన్న కేరళ అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. రెండవ రాష్ట్రంగా ఢిల్లీ, తదుపరి కర్ణాటక చక్కటి పాత్రను పోషిస్తున్నాయి. వాస్తవానికి, పౌర గ్రంథాలయాల అధికారాలు, వికేంద్రీకరణ స్థానిక సంస్థలకు స్వయంప్రతిపత్తి అందించి చైతన్యవంతంగా వర్ధిల్లుతున్నాయి. కేరళ రాష్ట్రంలోనే దాదాపు 9000 లైబ్రరీలు ఉన్నాయి. కేరళలో లైబ్రరీలు ట్రస్ట్‌ లేదా ప్రజల సొసైటీలుగా ఏర్పడి కేరళ స్టేట్‌ లైబ్రరీ కౌన్సిల్‌కు అనుబంధంగా ఉంటున్నాయి. ఇది లైబ్రరీలకు గ్రేడ్‌, ర్యాంక్‌ (కొన్ని ప్రమాణాల ఆధారంగా) ఇస్తూ కొంత ఆర్థిక సహాయ సహకారాన్ని అందిస్తుంది.
అతి తక్కువ పౌర గ్రంథాలు కలిగి ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ ఉన్నది. ఈ రాష్ట్ర అక్షరాస్యత కూడా అంత అంత మాత్రమే.
ప్రతి వీధిలో కనీసం ఒక పబ్లిక్‌ లైబ్రరీని లక్ష్యంగా పెట్టుకొని, దీన్ని దశలవారీగా పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు నడవాలి.
ఒకనాడు స్వాతంత్య్రోద్యమంలో తలమానిక పాత్ర పోషించిన పౌర గ్రంథాలయాలు నేడు ఆ స్థాయిలో పనితీరు కనబరచలేకపోతున్నాయి. కారణాలు ఏవైనాగానీ వాటిని అధిగమించినప్పుడే గ్రంథాలయాలు పునర్జీవనంతోటి సబ్కా సాత్‌ సబ్కా వికాస్‌, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాలు ప్రపంచస్థాయి దష్టిని ఆకర్షించి నాలెడ్జ్‌ గేటు వేగా ఇండియా వర్ధిల్లుతుంది.
బిలిండ గేట్స్‌ ఫౌండేషన్‌, రూమ్‌ టు రీడ్‌, రూరల్‌ లైబ్రరీ ఫౌండేషన్‌, సమగ్ర ఫౌండేషన్‌, బెంగళూరు కేర్స్‌, ఉన్నతి ఫౌండేషన్‌, యూనిసెఫ్‌ ఇండియా/ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక, ఇండియా లిటరసి ప్రాజెక్ట్‌, మక్కల జాగతి, సమగ్ర ఫౌండేషన్‌, హిపో క్యాంపస్‌ రీడింగ్‌ ఫౌండేషన్‌, రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, రంగనాథన్‌ సొసైటీ ఫర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అండ్‌ లైబ్రరీ డెవలప్మెంట్‌, సన్మతి పుస్తకాలయ ట్రస్ట్‌, జాయింట్‌ అసిస్టెంట్‌ సెంటర్‌, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌, డీఎల్‌ఎఫ్‌ పౌండేషన్‌, అజీమ్‌ ప్రేమ్‌ జీ ఫౌండేషన్‌ తదితర స్వచ్ఛంద సంస్థలు గ్రంథాలయాల అభివద్ధికి నిరంతరం శ్రమిస్తున్నాయి
డా||రవికుమార్‌ చేగొని