ఉర్దూ అకాడమి కాంట్రాక్టు ఉద్యోగుల అవస్థ

– ఏడు నెలలుగా జీతాల్లేక ఇబ్బంది
– ప్రభుత్వం కనికరం చూపాలంటూ వేడుకోలు
– రంజాన్‌ పండుగలోపు ఇవ్వాలంటూ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రతినెలా జీతాలు రాకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ కోసం అప్పులపాలవుతున్నారు. ఇంటి అద్దె, ఖర్చులు, వైద్యం కోసం, మందులు, పిల్లల ఫీజులు, నిత్యావసర వస్తువుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కనికరం చూపలేదనీ, బడ్జెట్‌ లేదంటూ సమాధానం చెప్పేవారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ కంప్యూటర్‌ సెంటర్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో 142 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు 15 నుంచి 30 ఏండ్లుగా పనిచేస్తున్నారు. వారికి రూ.ఐదు వేల నుంచి రూ.8,500 చాలీచాలని జీతం మాత్రమే వస్తున్నది. అవి కూడా ప్రతినెలా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 11న రంజాన్‌ పండుగ ఉన్నది. ఇంకా ఎనిమిది రోజులే సమయమున్నది. కుటుంబ అవసరాలు, బట్టలు, నిత్యావసర వస్తువులు కొనేందుకు డబ్బుల్లేవని ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో కనీస వేతనాలు ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం న్యాయం చేస్తుంది : అసోసియేషన్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందంటూ తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమి కంప్యూటర్‌ కం లైబ్రరీస్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అఫ్సాన్‌ అబ్రార్‌, ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ అఖీల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రభుత్వంలో అయినా తమ బతుకులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పూర్తి నమ్మకంతో ఉన్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించి పెండింగ్‌లో ఉన్న జీతాలు మొత్తం రంజాన్‌ పండుగలోపు అందరికీ చెల్లించాలని కోరారు. వారి కుటుంబాల్లో సంతోషం నింపాలని తెలిపారు. కనీస వేతనాలను అమలతు చేయాలని సూచించారు.