నవతెలంగాణ – తాడ్వాయి
భారీ వర్షాల వల్ల ప్రజలు విద్యుత్ ప్రమాదాల పాడిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ములుగు జిల్లా విద్యుత్ శాఖ డీఈ పులుసు నాగేశ్వరరావు కోరారు. ఆదివారం ఫోన్లో నవతెలంగాణతో మాట్లాడారు. ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షాల వేళ ప్రజలు ఇండ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని డి ఈ సూచించారు. లేదంటే ప్రాణాలకే ప్రమాదముని తెలిపారు. విద్యుత్ పరికరాలకు విద్యుత్ తీగల కు దూరంగా ఉండాలన్నారు. తడిసిన మోటార్లతో రైతులు జాగ్రత్త వహించాలన్నారు. ఇంటి సర్వీస్ వైర్లని కానీ వాటితో వేలాడే ఇనుప తీగలను కానీ బట్టలు ఆరేసుకునే తీగలకు దగ్గరలో విద్యుత్ వైర్లు లేకుండా చూసుకోవాలన్నారు. బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి చెప్పాలన్నారు. లోతట్టు ప్రాంతాలు భవనాలు సెల్లార్లలో నీరు చేరితే తమకు సమాచారం అందించాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే 1912, దగ్గర్లోని ఏఈ, లైన్ మాన్ లకు సమాచారం అందించాలన్నారు. ఏజెన్సీలో భారీ వర్షాల దృష్ట్యా విద్యుత్ సరఫరా పరిస్థితి పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.