– నిషేధం దిశగా సర్కార్ అడుగులు
– క్షేత్రస్థాయిలో లెక్కలు తీస్తున్న సిబ్బంది
– త్వరలో విధానపరమైన నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో విచ్చల విడిగా నడుస్తున్న బెల్టు షాపులపై ఉక్కు పాదం మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలనే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బెల్ట్ షాపులున్నాయి? వాటిని పూర్తిగా నిషేదించడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? తదితర అంశాలపై అబ్కారి శాఖ ఇచ్చే నివేదిక అధారంగా త్వరలో సర్కార్ విధాన పరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు, వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హౌటళ్లు ఉన్నాయి. 12,769 గ్రామ పంచాయతీలుండగా…ఒక్కో గ్రామంలో అనధికారికంగా 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులున్నాయి. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా బెల్ట్ షాపులుంటాయని గణాంకాలు చెబుతున్నాయి. గ్రామాల్లో కిరణా షాపులు, కిళ్లీ కొట్లు, బెల్ట్ షాపులకు నిలయాలుగా మారాయి. మద్యం దుకాణాల్లో ప్రభుత్వం సూచించిన నిర్దేశిత సమయంలో లిక్కర్ అమ్ముతుండగా, బెల్ట్ షాపుల్లో మాత్రం 24 గంటల పాటు అమ్ముతున్నారు. ఫలితంగా తాగుడుకు బానిసలయ్యే వారి సంఖ్య భారీగా పెరిగి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్టు షాపులను మూసేస్తామని ఎన్నికల ముందు ఆ పార్టీ నేతలు అనేక సభల్లో చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అదే క్రమంలో బెల్ట్ షాపులపై నిషేదాన్ని కూడా పకడ్బందిగా అమలు చేయాలనే ఆలోచనతో కసరత్తు ప్రారంభించింది. సంబంధిత అంశాలపై అబ్కారి శాఖ క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించే పనిలో నిమగమైంది. ఒకే సారీ నిషేధాన్ని అమలు చేయాలా? దశల వారీగా అమలు చేయాలా? అనే దానిపై అదికారులు కసరత్తు చేస్తున్నారు. బెల్టుషాపుల మూసివేతను నిబద్ధతతో అమలుపరుస్తే లక్షలాది కుటుంబాలకు మేలు జరిగే అవకాశం ఉందనే డిమాండ్ సర్వత్రా వ్యక్తం అవుతోంది.
25 శాతం తగ్గనున్న ఆదాయం
రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదైన 2014లో మద్యం ద్వారా ఖజానాకు రూ. 10,863 కోట్లు సమకూరగా, అ తర్వాత ఏడాది రూ.12,500 కోట్ల మార్కును దాటింది. వరుసగా పెరుగుదల రేటును నమోదు చేసుకుంటూ 2021లో రూ.30 వేల కోట్లు, 2022లో రూ.36 వేల కోట్లకు చేరింది. ఈ రకంగా రాష్ట్ర ఖజానాకు మద్యం ఆదాయమే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. గత పదేండ్లలో దాదాపు రూ.2.5లక్షల కోట్లకు పైగా ఆదాయ ం ఈ విభాగం నుంచే సర్కారుకు వచ్చింది. ఈ నేపథ్యం లో బెల్ట్ షాపులను రాష్ట్రంలో పూర్తిగా ఎత్తివేస్తే 25 శాతానికి పైగా ఆదాయం తగ్గే అవకాశం ఉంది. ఈ లోటు ను ఏ విధంగా భర్తీ చేసుకోవాలనే అంశంపై భిన్నాభిప్రా యాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఆదాయం తగ్గినా ప్రజలకిచ్చిన మాట మేరకు బెల్ట్ షాపుల పూర్తి నిషేధం వైపు అడుగులు వేయాలనే ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని తెలుస్తోంది.