– ముఖ్యమంత్రి డిజైన్ చేసిన ఎత్తిపోతల ప్రాజెక్టుకు మోక్షం కరువు
– ఎన్నికల కోడ్‌తో ఆగిన శంకుస్థాపన కార్యక్రమం
నవ తెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
స్వయంగా ముఖ్యమంత్రి డిజైన్ ఫైనల్ చేసినా.. అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టుకు మోక్షం కలగ లేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యంత వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో సాగునీటి కోసం రూపొందించిన అచ్చంపేట ఎత్తిపోతల పథకం కాగితాలకే పరిమితమైంది. ఎన్నికల ముందు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాటు జరిగినా కోడ్ అమల్లోకి రావడంతో అదీ ఆగిపోయింది.
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతలలో అంతర్భాగంగా అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 71,600 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకం ఐదేండ్లుగా సర్వేకే పరిమితమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బాగా వెనుకబడింది అచ్చంపేట ఏజెన్సీ ప్రాంతం. ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు అందుబాటులో లేదు. 2018 ఎన్నికలకు ముందు అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఏజెన్సీ ప్రాంతానికి సాగు నీరు అందిస్తామని బీఆర్‌ఎస్ నేతలు హామీ ఇచ్చారు. అమ్రాబాద్, పదర, బల్మూర్, అచ్చంపేట లింగాల, ఉప్పునుంతల, తెలకపల్లి తదితర మండలాల పరిధిలో 71,600 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి 25 కిలోమీటర్ల కాల్వ తవ్వి బల్మూరు ప్రాంతానికి నీటిని అందిస్తామన్నారు. లింగాల మండలంలోని సూరారం గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన లిఫ్ట్ ద్వారా 70 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి బల్మూరు దగ్గర కొత్తగా నిర్మించిన ఉమామహేశ్వర రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 2.50 ఎంసీలుగా నిర్ణయించారు. ఉమామహేశ్వర రిజర్వాయర్ నుంచి కొత్త కాల్వను తీసి బల్మూరు, లింగాల, అచ్చంపేటలో 57,200 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రెండు స్టేజీల్లో కలిపి రూ.2500 కోట్లు ప్రతిపాదించారు. మొదటి స్టేజి కింద పనులను రూ.1530 కోట్లతో బృంద కంపెనీకి అప్పగించారు. ఉమామహేశ్వర రిజర్వాయర్ నుంచి కాల్వ తీసి చంద్రవాగు ద్వారా చంద్ర సాగర్‌ను నింపుతామన్నారు. చంద్ర సాగర్ కట్టను మెరుగుపరిచి 0.3 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి, లిఫ్టు ద్వారా మున్ననూరు దగ్గర కొత్తగా నిర్మించే మద్దిమడుగు ఆంజనేయ స్వామి రిజర్వాయరుకు పంపించాలని ప్రణాళికవేశారు.
దీని సామర్థ్యం 1.5 ఎంసీలుగా నిర్ణయించారు. దీని ద్వారా అమ్రాబాద్ మండల పరిధిలో 14400 ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ నిర్ణయం. అదేవిధంగా, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలో 15 గ్రామాలు 23,220 ఎకరాలకు సాగునీరు అందించాలి. ఉప్పునుంతల మండల పరిధిలో నాలుగు గ్రామాలకు 1551 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. బల్మూరు మండల పరిధిలో 20 గ్రామాలకు 23073 ఎకరాలకు నీరు అందించాలి. లింగాల మండల పరిధిలోని ఎనిమిది గ్రామాల్లో 4,566ఎకరాలు, తెలకపల్లి మండల పరిధిలో ఆరు గ్రామాలు 4790 ఎకరాలకు సాగునీరు అందించటం లక్ష్యంగా ఉన్నది. ఏజెన్సీ ప్రాంతమైన అమ్రాబాద్ మండల పరిధిలో ఐదు గ్రామాల్లో 9,560 ఎకరాలు, పదర మండల పరిధిలో రెండు గ్రామాల్లో 4,840 ఎకరాలకు సాగునీరు అందించాల్సివుంది.
సమస్యలు పరిష్కారం చేయకుండా..
ఈ ఎత్తిపోతల పథకం మొదలెట్టడానికి ఇప్పటికీ సాంకేతిక సమస్యలే పరిష్కారం కాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 4000 ఎకరాల సాగు భూమిని రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. గతంలో సేకరించిన భూముల విషయంలో రైతులు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సరైన పరిహారం ఇవ్వకుంటే రైతులు భూములు ఇవ్వడం కష్టం. రెండో పేజ్‌లో నిర్మించ తలపెట్టిన ఉమామహేశ్వర లిఫ్ట్‌కు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. హడావిడిగా ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేయడానికి భూమి పూజ చేసేందుకు యత్నిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి.
ఎన్నికల ముందు శంకుస్థాపన..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదగా శంకుస్థాపన చేయించాలని బీఆర్‌ఎస్ నేతలు పైలాన్ సిద్ధం చేశారు. మంగళవారం కార్యక్రమం జరగాల్సి ఉండగా సోమవారమే ఎన్నికల కోడ్ వచ్చింది. దాంతో అధికారిక కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ఐదు సంవత్సరాలు పట్టించుకోని పాలకులు.. తీరా ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఓట్లతో లబ్ది పొందడం తప్ప హామీల అమలు పట్ల చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.