– కేంద్ర మంత్రి జైశంకర్‌కు స్టాలిన్ లేఖ
చెన్నై: శ్రీలంక నావికాదళ అధికారులు అదుపులోకి తీసుకున్న 138 మత్స్యకారుల బోట్లను, 45 మంది మత్స్యకారులను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖా మంత్రి ఎస్.జైశంకర్‌కు స్టాలిన్ గురువారం లేఖ రాశారు. డిసెంబర్ 13వ తేదీ (బుధవారం) ఆరుగురు మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుంది. ఇలాంటి ఘటన జరగడం ఈ వారంలో ఇది మూడో సారి అని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లో చేపల వేట సాగిస్తున్న తమిళనాడుకు చెందిన ఆరుగురు మత్స్సకారులను శ్రీలంక నావికాదళ అధికారులు కంకేసంతురై ప్రాంతానికి సమీపంలో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఆ ఆరుగురులో.. నరేశ్ (27), ఆనందబాబు (25), అజరు(24), నందకుమార్ (28), అజిత్ (26)లుగా గుర్తించారు. ఆరో వ్యక్తి ఎవరనేది సమాచారం లేదు. అలాగే ఈ నెల 9న రెండు ట్రాలర్‌లతోపాటు 25 మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం పాయింట్ పెడ్రో టౌన్ పట్టణానికి సమీపంలో అదుపులోకి తీసుకుంది. వీరంతా పుదుచ్చేరి, నాగపట్నం, కరైకాల్ జిల్లాలకు చెందిన మత్స్యకారులు. వీరిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. గతంలో అదుపులోకి తీసుకున్న వందలాది బోట్లను, మత్స్యకారులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. కాగా, అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా పదుల సంఖ్యలో మత్స్యకారులను శ్రీలంక నావికాదళ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వశాఖ చొరవ తీసుకుని వారిని విడిపించేందుకు చర్యలు తీసుకుంది.