బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిపుష్టికి చర్యలు తీసుకోవాలి

– బీఎస్‌ఎన్‌ఎల్‌ క్యాజువల్‌, కాంట్రాక్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి అనిమేశ్‌ మిత్రా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిపుష్టికి చర్యలు తీసుకోవాలనీ, 4జీ, 5జీ సేవలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ క్యాజువల్‌, కాంట్రాక్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి అనిమేశ్‌ మిత్రా డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సౌత్‌జోన్‌ రాష్ట్రాల సమావేశం జరిగింది. దీనికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిమేశ్‌ మిత్రా మాట్లాడారు. ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్‌ తో పాటు కనీసం వేతనం రూ.26వేలు చెల్లించాలని సమావేశంలో తీర్మానించామన్నారు. సర్వీస్‌ లెవెల్‌ అగ్రిమెంట్‌ కాంట్రాక్టు పద్ధతి రద్దు చేయాలనీ, ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్లకు కనీసం వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని కోరారు. సంస్థలో ఇప్పటివరకూ అక్రమంగా 60 వేల మందిని తొలగించారనీ, వాటిని ఆపాలని డిమాండ్‌ చేశారు. సర్వీసులను ప్రయివేటీకరణ చేసిన తర్వాత ఔట్‌ సోర్సింగ్‌లో వర్కర్లను నియమించుకుని ఎక్కువ గంటలు పనిచేయించుకుంటూ తక్కువ వేతనాలిస్తున్న తీరును వివరించారు. మేనేజ్‌ మెంట్‌ కక్షపూరితంగా యూనియన్లలో కీలకంగా ఉన్న కార్మికులను వేధిస్తూ వేరే జిల్లాలకు బదిలీ చేయడం దారుణమన్నారు.
తెలంగాణ బీఎస్‌ఎన్‌ఎల్‌ క్యాజువల్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం.తిరుమలాచార్యులు, బి.పరిపూర్ణాచారి
బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ క్యాజువల్‌, కాంట్రాక్టు ఎంప్లాయీన్‌, లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం.తిరుమలాచార్యులు, బి.పరిపూర్ణాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ యూనియన్‌ సమావేశం హైదరాబాద్‌లో బి.మధు అధ్యక్షతన జరిగింది. అందులో నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా జి. సాంబశివరావు, ఉపాధ్యక్షలుగా తలసీరామ్‌, బి. నాయుడు, కార్యదర్శులుగా రాఘవేందర్‌, హరీశ్‌, కోశాధికారిగా బి.శ్రీధర్లు, నిర్వహణ కార్యదర్శులుగా నవీన్‌, నాగరాజు , నవీన్‌, జానీ , రాజా సతీష్‌, కమిటీ సభ్యులుగా 10 మంది ఎన్నికయ్యారు.