నవతెలంగాణ-నిర్మల్
జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిని గుర్తించి బాధ్యతగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతకు కుటుంబ సభ్యులు అవగాహన కల్పించాలని తెలిపారు. యువత మత్తు పానీయాలు, సిగరెట్లు, గుట్కాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ విలువైన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ పౌరులు మాదకద్రవ్యాలకు బానిస కాకుండా మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతోందన్నారు.
పట్టణంలో ర్యాలీ
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆర్డీవో కార్యాలయం నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థల విద్యార్థులు, పోలీసులు, పట్టణ ప్రముఖులు, విద్యాశాఖ, ఐసిడిఎస్ తదితర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందితో నిర్వహించిన ర్యాలీలో డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం, యువతను కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. మాదకద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. పాఠశాల, కళాశాలల స్థాయి నుంచి విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధించి అవగాహన పోస్టర్లను అధికారులు, యువతతో కలిసి అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అధికారులు, విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆర్డిఓ రత్నకళ్యాణి, డిడబ్ల్యుఓ నాగమణి, డీఈవో రవీందర్‌రెడ్డి, డిఎంహెచ్‌ఓ ధనరాజ్, డిపిఆర్‌ఓ విష్ణువర్ధన్, తహసీల్దార్లు రాజు, సంతోష్, ఐసిడిఎస్, పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు, విద్యార్థులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
తలమడుగు: మాదకద్రవ్యాల నిర్మూలపై బుధవారం మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. నేటి సమాజంలో యువత మాదకద్రవ్యాలతో నిండు జీవితాలను పాడు చేసుకుంటోందని పోలీసులు పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది అశోక్, గోపాల్, గంగన్న, ఉపాధ్యాయులు వినోద్‌రెడ్డి, శ్రీనివాస్, మురళీధర్ పాల్గొన్నారు.
బోథ్: గంజాయి నిర్మూలించడం అందరి బాధ్యత అని సీఐ రమేష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు సోనాలలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గంజాయి రహిత మండలంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుండి మండల కేంద్రంలోని వీధుల గుండా విద్యార్థులు, యువకులు కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోథ్, సోనాల బస్టాండ్‌లలో ప్రజలతో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్సై రాము, ఎంపిడిఓ రమేష్, ఎంపీఓ మహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, ఎంపీటీసీ మహేందర్, మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్, సొనాల యువజన సంఘం అధ్యక్షుడు తుల హరీష్, సభ్యులు రంజిత్, వెంకట్, శరత్ పాల్గొన్నారు.
నార్నూర్: మాదక ద్రవ్యాలకు ప్రతిఒక్కరూ దూరంగా ఉండాలని ఏఎస్‌ఐ గంగారెడ్డి సూచించారు. బుదవారం మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, గంజాయి, మద్యపానం, దుమపానం, డ్రగ్స్, పొగాకు లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ప్రాణాలు కోల్పోవద్దన్నారు. విలువైన ప్రాణాలు కోల్పోకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు. అవగాహన కార్యక్రమంలో పోలీసులు తానాజీ, గోపి, జైవంత్‌రావ్ పాల్గొన్నారు.
బజార్‌హత్నూర్: యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని యువత మత్తు పదార్ధాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని సీఐ రమేష్ సూచించారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసుల అధ్వర్యంలో కళాశాలల విద్యార్థులతో మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం డేగమ గ్రామంలో మాదక ద్రవ్యాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తహసీల్దార్ శంకర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎస్సై నరేష్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి: సమాజంలో విజృంభిస్తున్న మత్తు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఎస్సై దుబ్బాక సునీల్ అన్నారు. బుధవారం పోలీసులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులలో ర్యాలీ నిర్వహించారు. పోలీసు స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంజి చౌక్ వరకు కొనసాగింది. మత్తు పదార్థాలు వద్దురా, దీనిని సేవించ వద్దురా, దీనికి బానిసై ఆరోగ్యం పాడు చేసు కోవద్దురా, ర్యాలీలో అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఇందులో ఉపాధ్యాయులు సత్యనారాయణ, నాందేవ్, మచ్చిందర్, పిడి మమత పాల్గొన్నారు.
లోకేశ్వరం: మత్తు పదార్థాలనుసశక్తంగా ఉండి సవ్యసమాజస్థాపన జరగాలని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ తుకారం అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. నేటి యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని, వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇందులో కళాశాల అధ్యాపక బృందం, ఎస్‌ఐ మోహన్ రావ్, పోలీసు సిబ్బంది విద్యార్థులున్నారు.
ఉట్నూర్: మాదక ద్రవ్యాలను బానిసలు కావద్దని ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ అన్నారు. బుధవారం పట్టణంలోని కేబీ కాంప్లెక్స్ నుండి ఐబీ చౌరస్తా వరకు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, పోలీసులు ర్యాలీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ మొగిలి, ఎస్‌ఐ మనోహర్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సారంగాపూర్: యువత మాదక ద్రవ్యాలకు బానిస కావద్దని ఎస్సై శ్రీకాంత్ అన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా బుధవారం మండలంలోని స్వర్ణ గ్రామంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్స్ రవి, నవీన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
కెరమెరి: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడితే భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్సై గుంపుల విజరు కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
కాగజ్‌నగర్: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కాగజ్‌నగర్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు మత్తు పదార్ధాలకు అలవాటు పడితే ఆ సమాజం తిరోగమనంలో పయనించినట్లేనని అన్నారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ శంకరయ్య, ఎస్‌ఐలు అంజన్న, మహేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.