– స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఏర్పాటుకు ఆలోచనలు
– రూ.2వేల కోట్లతో మిల్లుల ఏర్పాటుకు సీఎం గ్రీన్‌సిగల్
– రూ.100కోట్లకుపైగా పెట్టుబడికి టేలర్‌మేడ్ ఇన్సెంటీవ్స్
– స్పెషల్ జోన్లలో ఐదేండ్లపాటు యూనిట్ విద్యుత్‌కు రూ.2 చార్జీ
– 75శాతం వరకు వడ్డీ మాఫీ, మార్కెట్ ఫీజులో 100శాతం రాయితీ
– బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
– హైదరాబాద్ సచివాలయంలో జపాన్ సటాకే కార్పొరేషన్ ప్రతినిధులతో భేటి
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘రాష్ట్రంలో భూమికి బరువయ్యేంతలా వస్తున్న ధాన్యం దిగుబడులకు ఇప్పుడున్న మిల్లింగ్ సామర్థ్యం సరిపోవడం లేదు. అందువల్ల ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన చోట మిల్లుల ఏర్పాటుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ మిల్లుల ఏర్పాటుకు రూ.2వేల కోట్ల విడుదలకు గ్రీన్ సిగల్ ఇచ్చారు. వీటితోపాటు స్పెషల్ ఫుడ్‌ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేసి అక్కడ పెట్టుబడులు పెట్టి మిల్లులు ఏర్పాటు చేసుకునేవారికి రాయితీలు, ప్రభుత్వ సహకారం అందిస్తాం’ అని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సచివాలయంలో జపాన్‌కు చెందిన సటాకే కార్పొరేషన్ ప్రతినిధులతో ఆయన బుధవారం భేటీ అయ్యారు.
ప్రభుత్వం మిల్లులను ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ప్రత్యేకంగా రూ.100కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినవారికి టేలర్ మేడ్ ఇన్సెంటీవ్స్ అందిస్తుందని మంత్రి చెప్పారు. ఈ జోన్లలో సాధారణ పెట్టుబడిదారులకు సైతం ఐదేండ్లపాటు యూనిట్ విద్యుత్‌కు రూ.2చార్జీతో నాణ్యమైన కరెంటు, 75 శాతం వరకూ వడ్డీ మాఫీ, మార్కెట్ ఫీజుల్లో 100 శాతం రాయితీ అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలకు ప్రత్యేక రాయితీలనూ అందిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు.
ప్రపంచ టెక్నాలజీని ఒడిసిపట్టుకుని..
ప్రపంచవ్యాప్తంగా వచ్చే అత్యాధునిక టెక్నాలజీని ఒడిసిపట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంటుం దని, మిల్లింగ్ ఇండిస్టీలోనూ ఆ సాంకేతికతను అంది పుచ్చుకుంటామని తెలిపారు. ధాన్యం మిల్లింగ్‌తోపాటు ఉప ఉత్పత్తులైన రైస్ బ్రాన్ ఆయిల్, నూక తదితరాల ప్రాసెసింగ్ సైతం చేస్తామన్నారు. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ అందిస్తున్న ‘సటాకే’, ‘సైలో’ తదితర కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సటాకె కార్పొరేషన్, ఇతర కంపెనీల ప్రతి నిధులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంత్రికి వివరించారు. గంటకు 20టన్నుల నుంచి 1200 టన్నుల మిల్లింగ్ కెపాసిటీ తమ సొంతమని తెలిపారు. బాయిల్డ్, రా రైస్ దేనికైనా అనుగుణంగా అత్యంత అధునాతన పద్ధతుల ద్వారా వ్యర్థం, వ్యయం తగ్గేలా టెక్నాలజీ అందిస్తున్నామని చెప్పారు. అమెరికా, చైనా, థాయిలాండ్, వియత్నాం తదితర దేశాలతోపాటు ఇండియాలోని తమ కార్యకలాపాలను వివరించారు. కంపెనీ ప్రతినిధులతో అన్ని అంశాలూ కూలంకషంగా చర్చించిన మంత్రి గంగుల.. త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామని తెలిపారు. ఈ భేటీలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, సంస్థ జీఎం రాజారెడ్డి, టిఎస్ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖిల్ కుమార్ గవార్, ప్రతినిధి సుష్మ, జపాన్ సటాకే కార్పోరేషన్ ప్రతినిధులు ఆర్కే బజాజ్, హెచ్. సతిష్ కుమార్, కె.విఠల్, కె.వినరు కుమార్ పాల్గొన్నారు.
సీఎం దార్శనికతతోనే పదింతల ధాన్యం దిగుబడి
సీఎం కేసీఆర్ దార్శనిక విధానాలతోనే ధాన్యం దిగుబడులు రాష్ట్రంలో పదింతలు పెరిగాయని మంత్రి గంగుల అన్నారు. అందుకు అనుగుణంగానే మిల్లింగ్ ఇండిస్టీని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2014లో 1815 రైస్ మిల్లులు ఉండగా నేటికి వాటి సంఖ్య 2574కి మాత్రమే పెరిగిందని, ఈ నేపథ్యంలో ఏటా 3 కోట్ల టన్నులకుపైగా ఉత్పత్తవుతున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసే సామర్థ్యం సరిపోవడం లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశించారని, అందుకు రూ.2వేల కోట్లు ఇచ్చేందుకు అనుమతులూ ఇచ్చారని చెప్పారు.