చెట్టుమీద కాయకు, సముద్రంలో ఉప్పుకు సంబంధం ఉన్నట్టే ప్రపంచ పరిణామాలకు, రాష్ట్ర రాజకీయాలకు మధ్య బంధమేదో ముందుకొస్తున్నది. అభివృద్ధి చెందిన దేశమైన ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో వామపక్ష గ్రూపు అతిపెద్ద సమూహంగా ఎన్నికైంది. భారతదేశం చుట్టూ కొత్తగాలి వీస్తోంది. బంగ్లాదేశ్‌లో ప్రజావ్యతిరేక పాలకులను ప్రజలు దేశం నుంచే తరిమేశారు. ఉద్యమాలతో అట్టుడికిన శ్రీలంక ఎర్రజెండాకు పట్టం కట్టింది. దశాబ్దకాలానికి పైగా నేపాల్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వం నడుస్తున్నది. దక్షిణ అమెరికా పరిణామాలు తెలిసినవే. అంతర్జాతీయ వాణిజ్యంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న అమెరికాను దాటి చైనా మొదటి స్థానంలో నిలిచింది. ఈ గాలుల ప్రభావం భారత దేశం మీద పడకుండా ఉంటుందా? అనే ఆందోళన పాలకవర్గాల్లో మొదలైంది. అందుకేనేమో ప్రశ్నించే ప్రజల ఆందోళనల పట్ల అసహనం ప్రదర్శిస్తున్నారు. పదకొండేండ్లుగా కేంద్రంలో బీజేపీ పాలన చూస్తున్నారు జనం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు ఏడాదిగా మరోసారి గమనిస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్లు బీఆర్‌ఎస్ పాలనను రుచి చూశారు. జెండాల రంగులు, పార్టీల పేర్లు వేరైనా విధానాలొక్కటే కదా! తెలుగురాష్ట్రాల్లో ఎర్రజెండా వారసత్వం ఇంకా ప్రజలు మరచిపోలేదు. తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే అటు ఆంధ్ర ప్రాంతం లోగానీ, ఇటు తెలంగాణ అసెంబ్లీలో గానీ కమ్యూనిస్టులకు గణనీయమైన సంఖ్యలో పట్టంగట్టారు. అటు జాతీయోద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర, ఇటు తెలం గాణలో దొరల పాలనకు, రాచరికానికి వ్యతిరేకంగా రైతాంగ తిరుగుబాటు ఇందుకు పునాదులు వేసింది. ఈ పోరాటాల్లో ఇరువైపులా సరిహద్దు జిల్లాల ప్రజల పరస్పర సహకారం చరిత్రలో మరవలేనిది. పాలకవర్గాలు కూడా ఇది మర్చిపోరు కదా. అందుకే వారి మదిలో ఏదో ఒక మూల ఆందోళన వెన్నాడుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి.
గత అర్ధ శతాబ్ద కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో గానీ, ప్రస్తుత తెలంగాణలో గానీ ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పులు అనేకం జరి గాయి. పెట్టుబడిదారీ విధానం బలపడింది. వ్యాపార ధోరణులు విస్తరించాయి. సరళీకృత ఆర్థిక విధానాలు వీటిని మరింత వేగవంతం చేశాయి. ఫలితంగా సమాజంలో విలువల వలువలూడుతున్నాయి. వీటి ప్రభావం అన్ని రంగాలను ఆవహిస్తున్నది. కమ్యూనిస్టేతర పార్టీల ప్రభావాలు, పార్లమెంటరీ భ్రమలు ఎర్రజెండా శ్రేణుల మీద కూడా ఎంతోకొంత ప్రభావం చూపుతున్నాయి. అందుకే కమ్యూనిస్టు శ్రేణులు పోరాటాల్లో అగ్రభాగాన ఉన్నప్పటికీ రాజకీయ క్షేత్రంలో బలహీనపడ్డారు. ఎన్నికల్లో ఉన్నత లక్ష్యాల కోసం కమ్యూనిస్టులు కృషి చేసినప్పటికీ వారితో కలిసి పోటీ చేసిన ఇతర పార్టీలకు మాత్రం చిత్తశుద్ధి లేదు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వామపక్షాల ప్రతిష్టను వాడుకోవడమే తప్ప పొత్తుధర్మం పాటించలేదు. ఇది వారి సహజ వర్గనైజం. వామపక్షాల బాధ్యతాయుత ఎత్తుగడలు, ఇతర పార్టీల బాధ్యతా రహిత కుయు క్తుల మధ్య ప్రజల్లో కొంత గందరగోళం నెలకొన్నది. ఆమేరకు వామపక్షాలకు నష్టం కూడా జరిగింది. సరళీకృత విధానాల నేపథ్యంలో ఓటు, సీటు, పదవి అన్నీ సరుకులుగా మారాయి. అవినీతి అన్ని రంగాలను ఆవహించింది. పార్టీ ఫిరాయింపులకు గౌరవస్థానం దక్కింది. వామపక్ష శ్రేణులకు ఈ పరిణామాలు కొత్త సవాలును విసురుతున్నాయి. ఎర్రజెండా పోరుబాట, సుందరయ్య స్ఫూర్తి వామపక్ష శ్రేణులకు కొత్త దారులు చూపుతున్నాయి.
కేంద్రంలో మోడీ సర్కార్ గానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ గానీ, నిన్నటిదాకా పాలించిన బీఆర్‌ఎస్ గానీ అవకాశవాదంతో పోటీపడుతున్నారు. ఏడాది కాలంగా లిక్కర్ కేసు, కాళేశ్వరం, ఫోన్‌ట్యాపింగ్, ఫార్ములా ఇ-రేస్‌ల పేరుతో ఆరోపణలు, ప్రత్యారోపణలే తప్ప ప్రజాసమస్యలు వీరికి పట్టవు. మూసీప్రక్షాళన, హైడ్రా సమస్యలూ అంతే. వికారాబాద్‌లో రాడార్ ఏర్పాటు విషయంలో ఈ మూడు పార్టీలదీ ఒకే దారి. పర్యావరణానికి ప్రమాదం లేని ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న వామపక్షాలు, పర్యావరణవేత్తల సూచనలను ఈ మూడు పార్టీలూ ఖాతరు చేయలేదు. ప్రజా సమస్యలు వీరెవరికీ పట్టవు. వీరిమూలాలు ఒక్కటే కావటమే ఇందుకు కారణం. కంపెనీల్లో వీరికి నచ్చని మాట కనీస వేతనాలు. యజమానులకు ఇష్టం ఉండదు కదా. వ్యవసాయ కార్మికులు, కౌలురైతుల మాటలంటేనే వీరికి గిట్టదు. అసైన్డ్ భూములు వీరికి ఇష్టమైన భోజనం. వీరి దృష్టిలో కార్మిక చట్టాలు, శ్రామికుల హక్కులు అభివృద్ధికి ఆటంకాలు. సింగరేణి బొగ్గుబ్లాకులు, ఆర్టీసీలో విద్యుత్తు బస్సులు పెట్టుబడిదారులకు నైవేద్యం పెట్టగల ఇష్టమైన భక్తులు వీరు. పెట్టుబడి పాదాల దగ్గర పూజారి ఎవరన్నదే వీరి తగాదా. రాజకీయరంగంలో ఇది కుర్చీల కొట్లాట.
బడాబాబుల ప్రయోజనాలకు అంకితమైన ఈ పార్టీలు ఓట్లకోసం మాత్రం పేదలను మభ్యపెడుతున్నాయి. ఈ ప్రయత్నాల నుంచే ఓట్ల పథకాలు ఆవిర్భవి స్తున్నాయి. సంక్షేమ జపంలో పోటీ పడుతున్నాయి.పెరుగుతున్న ధరలు, మారుతున్న జీవితా వసరాలతో సరిపడని ఆదాయం జనాల్ని సతమతం చేస్తున్నా యి. సంక్షేమ పథకాల పేరుతో విసిరిన ఓట్ల పథకాలు పేదలకు కొంత ఊరటనిస్తున్నాయి. అందుకే ఆకర్షితులవుతున్నారు. ఈ బలహీనతే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లాంటి పార్టీలకు బలం చేకూర్చుతున్నది. తక్షణం ఊరటనిచ్చే పథకాలను వెదజల్లి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే వాగ్దానాలకు మాత్రం వీరు మొండిచేయి చూపుతున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ, పోడు భూములపై హక్కులు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు లాంటి వాగ్దానాలు అటకెక్కాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మినహా ఆరు గ్యారంటీలలో మౌలికమైన వాగ్దానాలన్నీ మరుగున పడుతున్నాయి. ఖాళీ పోస్టుల భర్తీలు, ఇండ్లస్థలాలు, సాగుభూములు, కౌలురైతులు వంటి మాటలు పాలకుల నోట రావడంలేదు. బీఆర్‌ఎస్ పాలనలో పాలకులను అహంభావం ఆవరించింది. హక్కులంటే ఆగ్రహం కలిగించింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారంటీగా చెప్పుకున్న కాంగ్రెస్ పాలకులు బీఆర్‌ఎస్ చెప్పుల్లోనే అడుగులు పెట్టారు. రాజదండం తెచ్చి పార్లమెంటులో పెట్టిన కేంద్ర పాలకులకు రాచరికాలంటే ముద్దు. ప్రజాస్వామ్యం వారి దృష్టిలో పెనుముప్పు. హక్కులడిగినవారంతా వారి భాషలో దేశద్రోహులు. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్న తేడాలేదు. కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా అన్న వ్యత్యాసం లేదు. పెట్టుబడిదారులు, ఫామ్‌హౌస్ యజ మానుల పట్ల ప్రేమ, ప్రజల హక్కుల పట్ల అసహనం ప్రదర్శిస్తున్నారు. ప్రజలకు అండగా నిలుస్తున్న వామపక్షాల పట్ల చిర్రుబుర్రులాడుతున్నారు. జనంలో పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారులు పట్టించేందుకు దొడ్డిదారులు వెతుకుతున్నారు. ఇందులో బీజేపీది అందెవేసిన చెయ్యి. ఎన్నికలకు ముందు రజాకార్, కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ పేర్లతో సినిమాల ద్వారా ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టారు. రాముడిని, రామాలయాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్నారు. మెజారిటీ మతస్తులను ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. తర్వాత కూడా సమ్మక్క సారలమ్మ జాతర, జైనూరు, ఉట్నూరు ఘటనలు, సికింద్రాబాద్ ఉప్పుగూడ సంఘటనలను కూడా ఇందుకోసమే వాడుకునేందుకు ప్రయత్నించారు. బక్రీద్ పండుగ రోజున మైనారిటీల మీద దాడులకు తెగబడ్డారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గానీ, బీఆర్‌ఎస్ నాయకత్వం గానీ బీజేపీ కుయుక్తులను ఖండించలేదు. లౌకిక విలువల కోసం ప్రజలను సమాయత్తం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం శాంతి భద్రతల సమస్యగా మాత్రమే పరిగణించింది. ఒకవైపు బీజేపీ, ఎంఐఎం లాంటి పార్టీలు మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం అవకాశ వాదం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి కీలకమైన సందర్భాల్లో లౌకిక విలువల కోసం, ప్రజాస్వామ్యం కోసం నికరంగా నిలబడ్డది కేవలం వామపక్షాలే.
ప్రజా సమస్యల పరి ష్కారం కోసం నిరంతరం పోరుబాటలో ఉన్నది ఎర్ర జెండా. ప్రజలను సమీకరిం చి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నది కమ్యూనిస్టులు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల ముందుంచుతున్నారు. విద్యా, వైద్యం వ్యాపారమయం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ధరాభారం నుంచి ప్రజలను కాపాడేందుకు మార్గం చూపుతున్నారు. వ్యవసాయ సమస్యల పరిష్కారానికి నిర్ధిష్ట మార్గాలు పాలకుల ముందుంచుతున్నారు. కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగ సమస్యల పట్ల శాస్త్రీయ దృక్పథం ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రాధాన్యతను నొక్కి చెపుతున్నది కేవలం వామపక్షాలే. ఛిద్రమవుతున్న వృత్తిదారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపించవల్సిన బాధ్యత పాలకులదేనని ఎర్రజెండా ఎలుగెత్తి చాటుతున్నది. విస్తరిస్తున్న గ్రామీణ వ్యవసాయేతర కార్మికులకు బతుకుబాట చూపించ వల్సిన బాధ్యత కూడా పాలకులదే. మహిళల మీద పెరుగుతున్న లైంగిక దాడులు, కుల దురహంకార దాడుల పట్ల ఆందోళన చెందుతున్నది ఎర్రజెండా శ్రేణులే. సామాజిక న్యాయం కోసం పరితపిస్తున్నదీ, ప్రత్యామ్నాయం ప్రతిపాదిస్తున్నదీ వామపక్షాలే. విభజన హామీల అమలు కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో కలబడుతున్నది కమ్యూనిస్టులే. అందుకే మరోసారి తెలుగు ప్రజల దృష్టి కమ్యూనిస్టుల వైపు తిరుగుతున్నది. కమ్యూనిస్టుల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రజల రాజకీయ ముఖ చిత్రం మార్చగల సామర్థ్యం ఎర్రజెండా వెలుగులకే ఉన్నదని నమ్ముతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలను అక్కున చేర్చుకునే అరుణపతాకం అవసరమని మనసారా కోరుకుంటున్నారు. ప్రజల మనసెరిగి జనం బాట పట్టవలసిన బాధ్యత కమ్యూనిస్టులదే. శ్రామికుల ఆశలకనుగుణంగా అడుగులు వేయవలసిన బాధ్యత ఎర్రజెండా శ్రేణులదే. రాష్ట్ర రాజకీయాలు మూలమలుపులో ఉన్న దశలో సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలకు సంగారెడ్డి వేదిక కాబోతున్నది. ప్రజా ఉద్యమాలకు బాట చూపేవిధంగా కమ్యూనిస్టు శ్రేణులకు దిశానిర్ధేశం చేయబోతున్నాయి.
ఎస్. వీరయ్య