చిరంజీవి నటిస్తున్న మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ఈనెల 11న విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
‘అన్నయ్యని డైరెక్ట్ చేయడం ఒక డ్రీమ్. ఇప్పటికీ ఆ డ్రీమ్‌లోనే ఉన్నాను. ఈనెల 11న ఆ డ్రీమ్ రిలీజ్ అవుతుంది. చిన్నప్పటి నుంచి అన్నయ్యని, ఆయన సినిమాలని చూస్తూ ఆయన్ని ఇలా చూపించాలని ప్రతి క్షణం తపనపడుతూ ఈ సినిమా తీశాం. అన్నయ్య ఇచ్చిన ఎనర్జీతో సినిమా మొత్తం అయిపోయింది. అన్నయ్య కూడా చాలా ఎంజారు చేశారు. దర్శకుడికి ఏం కావాలో అన్నయ్యకి బాగా తెలుసు. ఇందులో నా ఒక్కడికే దక్కిన అదష్టం ఏమిటంటే నేను అన్నయ్య కజిన్. ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్ చేసి ఆయనతో ‘బావుందిరా’ అనిపించుకున్నాను. ఇలాంటి అదష్టం అందరికీ దక్కదు. నేను డైరెక్టర్ అయ్యిందే ఈ సినిమా చేయడానికేమో. ఇది పెద్ద అచీవ్ మెంట్.
దీని తర్వాత చేసేదంతా బోనస్. ఈ సినిమా విషయంలో అన్నయ్య సలహాలు సూచనలు ఖచ్చితంగా ఉంటాయి. రీమేక్ సినిమా అయినప్పటికీ ఆయనకి నచ్చితేనే ఆమోదముద్ర పడుతుంది. ఏదైనా కొత్తగా చేస్తే చాలా చక్కగా ప్రశంసిస్తారు. చాలా విలువైన ఇన్‌ఫుట్స్ ఇస్తారు. ముఖ్యంగా ‘వేదాళం’ రీమేక్ చేయడానికి కారణం ఏంటంటే ఇందులో అన్నయ్య తత్త్వం ఉంది. అది నాకు చాలా నచ్చింది. జనరేషన్ మారిపోయినా అనుబంధాలు అలానే ఉన్నాయి. యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బ్రదర్, సిస్టర్ ఎమోషన్ ఉన్న కథ ఇది. నేను ఇలాంటి సబ్జెక్ట్‌ని ఎప్పుడూ డీల్ చేయలేదు. చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టుగా ఇందులో మార్పులు చేశాం. సెకండ్ హాఫ్ చిరంజీవికి ఇచ్చిన ట్రీట్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది. మహతి సాగర్ వర్క్ నాకు తెలుసు. మెగాస్టార్ స్థాయికి సాగర్ మ్యూజిక్ చేయగలడని నా నమ్మకం, ఈ విషయంలో గొప్పదనం అంతా అన్నయ్యదే. సాగర్ పేరు చెప్పినపుడు మరో ఆలోచన లేకుండా ‘వెరీ గుడ్ మనం ప్రోత్సాహంచాలి’ అని అన్నారు. సాగర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు’ అని దర్శకుడు మెహర్ రమేష్ చెప్పారు.