నిశ్చల సంగీత ప్రపంచమతడు

Still music is the world religionతబలా వాయిద్యం అంటే తెరచాటున ఒక తబలా ప్లేయర్‌ వాయించే వాయిద్యంగానే చాలామందికి తెలుసు. కానీ దానికి సంగీత ప్రపంచంలో గొప్ప స్థానం ఉన్నదని, అది గొప్ప సంగీత గమకాలను పలికించగలదని తబలా విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన వాడు జాకీర్‌ హుస్సేన్‌. ఏ వాయిద్య పరికరమైన తన ప్రత్యేకతతో ఉంటుంది, కాకపోతే మనం వాటి ప్రత్యేకతను విస్మరిస్తాం. సంగీతాన్ని కొంచెం అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తే అది మనలని సంతోషపరిచి, ఉత్తేజ పరుస్తుంది. అప్పుడది జీవితకాల సంబంధంగా మారిపోతుంది. ప్రతి సంగీత వాయిద్యానికి ఒక ఆత్మ ఉంటుంది. అది మన ఆత్మతో మమేకమై ఒక కొత్త అంతర్‌ లోకాలను సష్టిస్తుంది.
తబలాతో నా సంబంధం ఏమిటంటే.. మేమిద్దరం స్నేహితులం. మేము ఈ ప్రయాణం లో ఎప్పుడూ కలిసే ఉన్నాం అంటాడు జాకీర్‌ హుస్సేన్‌.
జాకీర్‌ హుస్సేన్‌ని భౌతికంగా చూసినప్పుడు ఒక నిశ్చల సంగీత ప్రపంచం లాగా కనిపిస్తాడు. కానీ ఉత్తుంగ తరంగాల్లా ఎగిసిపడే జోరైన లయలతో కూడిన సముద్రాన్ని అతని ముని వేళ్ల నుంచి సష్టిస్తాడు. అతని కచేరీల్లో పాల్గొన్న ప్రేక్షకులు ఎవరైనా వాళ్లకు తెలియకుండానే వాహ్.. జాకీర్‌.. అని ఎన్నిసార్లు అయినా అంటారు. తబలాపైన ఆయన వేళ్లు ఆడుతున్నప్పుడు ఆయన ఏదైనా మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడా!? అనే భ్రమకు లోనవుతాం. అతన్ని సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిభగల దిగ్గజంగా నిలిపింది ఆ మాయా జాలమే. అతడు యుక్త వయస్సు వచ్చేనాటికి భారతదేశ శాస్త్రీయ సంగీత దిగ్గజాలల్లో ఒకడిగా నిలిచిపోయాడు.
”ఉస్తాద్‌ అల్లరఖా” గొప్ప తబలా విద్వాంసుడు. తబలాపై అతడికి ఎంత ప్రేమ అంటే అతడి తర్వాత అతడి కుమారుడు గొప్ప తబలా విధ్వాంసుడు కావాలని కలలు కన్నాడు. కానీ ఆ కుర్రాడికి క్రికెట్‌ అంటే మక్కువ. తబలా శిక్షణను ఎగ్గొట్టి క్రికెట్‌ ఆడటానికి వెళ్లేవాడు. క్రికెట్‌ ఆటలో ఒకసారి అతడి వేలు విరిగితే జాకీర్‌ తబలా వాయించడానికి పనికిరాడేమో అని అల్లారఖా చాలా బాధపడేవాడు. తండ్రి మనసు తెలిసిన జాకీర్‌ హుస్సేన్‌ అప్పటి నుండి తబలా పైనే దష్టిని కేంద్రీకరించాడు. పోనుపోనూ తబలాపైనే అతని హదయం మక్కువ చూపడం మొదలుపెట్టింది. అచంచలమైన అతడి సంగీత వ్యామోహం అతడి చేతివేళ్లను తబలాపై విన్యాసాలు చేయించింది. ప్రపంచం గర్వించదగ్గ భారతీయ తబలా విధ్వాంసుడుగా ఆయనను నిలబెట్టింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో ముస్లింలకు ఇచ్చే అత్యంత గౌరవమైన ”ఉస్తాద్‌”ను పొందాడు. చిన్న వయసులోనే పండిట్‌ రవిశంకర్‌, శివకుమార్‌ శర్మ, అలీ అక్బర్‌ఖాన్‌ లాంటి ప్రముఖ భారతీయ సంగీతకారులతో కలిసి ప్రదర్శన ఇచ్చాడు.
భారతదేశ సంగీత విద్వాంసులు ఒకప్పుడు మహారాజుల పోషణల్లో ఆస్థాన సంగీత విద్వాంసులుగా ఉండేవారు. వాళ్ల సంగీత ప్రదర్శనలు, ప్రతిభ అంతా కూడా మహారాజుల సభల్లో ప్రదర్శించడానికి మాత్రమే పరిమితమయ్యేది. సామాన్య ప్రేక్షకుల కోసం జరిగే సంగీత ప్రదర్శనలు చాలా అరుదుగా జరిగేవి. బ్రిటిష్‌ వారి పాలనలో రాచరిక వ్యవస్థ కూలిపోవడంతో భారతీయ సంగీతం కొంత సామాన్య ప్రేక్షకులకు చేరగలిగింది. 1947 భారత స్వాతంత్రం సిద్ధించే వరకు కూడా సంగీత ప్రదర్శనలు కొన్ని వర్గాలను మాత్రమే వీనులవిందు చేసేవి. ప్రజాస్వామిక భారతం ఏర్పడ్డ తర్వాత సంగీతకారులు ప్రజా బాహుళ్యం లోకి వచ్చి ప్రదర్శనలు ఇవ్వడం మొదలైంది. అప్పటికి యువకుడిగా ఉన్న ప్రముఖ సితార్‌ సంగీత విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌, జాకీర్‌ హుస్సేన్‌ తండ్రి అయిన ప్రముఖ తబలా వాయిద్యకారుడు ఉస్తాద్‌ అల్లారఖాలు కలిసి తమ సంగీత ప్రతిభను నిలుపుకోవడానికి కొన్ని ప్రయోగాలను చేశారు. అదేకాలంలో భారత దేశంలో విస్తరించి ఉన్న పాశ్చాత్య సంగీత ప్రభావం ప్రతిచోట కనిపిస్తున్నది. జాకీర్‌ హుస్సేన్‌ తరం నాటికి సింఫోనీలు, స్ట్రింగ్‌, బీటెల్స్‌, రోలింగ్‌ స్టోన్లు పెరిగాయి అప్పుడు చాలా మంది భారతీయ సంగీతకారులు పాశ్చాత్య సంగీత వాయిద్యాలను వాయించడం అభ్యసించి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కొత్త పరివర్తనతో కూడిన హైబ్రిడ్‌ సంగీత రీతులను సమకూర్చారు.
అప్పటికే రవిశంకర్‌ బృందంలో తబలా వాయిద్య కారుడైన జాకీర్‌ తండ్రి ఉస్తాద్‌ అల్లారఖా అనారోగ్యంగా ఉండడంతో తన తండ్రి స్థానంలో ఆయన రవిశంకర్‌ బృందం లో వాయిద్య సహకారాన్ని అందించాడు 1971లో సాన్‌ ఫ్రాన్సిస్కోలో రోలింగ్‌ తండర్‌ ద్వారా సోలో ఆల్బమ్‌ను తన బ్యాండ్‌ సభ్యులతో కలిసి రికార్డు చేశాడు. వాషింగ్టన్‌ యూనివర్సిటీలో ఎథ్నో మ్యూజిక్కాలజిని కోర్సుగా అభ్యసించాడు. అక్కడే పి.హెచ్‌.డి. చేసి అలీ అక్బర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో బోధించడానికి ఉత్తర కాలిఫోర్నియాకు వెళ్లాడు. హార్ట్‌, వ్యూర్టోరికిన్‌ పేర్క్‌, నైజీ రియన్‌ వాయిద్యకారుడు షికీరు ఆడే పోజుతో కలిసి 2009 ప్రపంచ సంగీత అత్యుత్తమ గ్రామీణ అవార్డులను గెలుచుకున్నాడు.
సంగీత కారుడిగా, ఒక గొప్ప టీచరుగా, అతడి తర్వాతి తరానికి గొప్ప స్ఫూర్తిదాతగా, గొప్ప విద్వాంసుడిగా ఒక తరం నుంచి ఇంకో తరానికి తబలా సంగీతాన్ని అందించిన గొప్ప సాంస్కతిక రాయబారిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆరు దశబ్దాల పాటు గొప్ప తబలా ప్లేయర్‌గా ప్రపంచవ్యాప్తంగా మన్ననలను పొందాడు. ప్రముఖ జాజ్‌ సాక్సోఫోన్‌ వాయిద్యకారుడు చార్లెస్‌ లాయిడ్‌, వాన్‌ మారిసన్‌ లాంటి ఉద్దండులతో కలిసి పనిచేశాడు.
సంగీత వాయిద్య పరికరాలతో కొత్త ప్రయోగాలు చేయడం జాకీర్‌కు ఇష్టం. 1973లో ప్రముఖ జాజ్‌ గిటారిస్ట్‌ జాన్‌ మేకలఫ్లిన్‌, భారతీయ వయోలిన్‌ వాయిద్య కారుడు ఎల్‌ శంకర్‌, భారతీయ పెర్కషన్‌ వాయిద్యకారుడు టి.హెచ్‌.వినాయకరంలతో కలిసి ఒక సంగీత బృందాన్ని ఏర్పరిచి తూర్పు పశ్చిమ సంగీత మేళవింపులతో చరిత్ర సష్టించాడు. అంతేకాదు ఇద్దరు పేర్కషన్‌ వాయిద్యకారులతో ఉత్తర దక్షిణ భారతదేశ సంగీతాన్ని మేళవించాడు. భారతీయ జాజ్‌, ప్యూన్‌ జన్‌ బ్యాండ్లను ఏర్పరిచాడు. భారతీయ సంగీత విధానాలను జాజ్‌ సంగీత అంశాలతో కలిపి అటు పాశ్చాత్యులు, ఇటు భారతీయులకు ఒక కొత్త సంగీత ధ్వనినీ పరిచయం చేశాడు.
అతని ముఖ్యమైన సంగీత వాయిద్యం తబలా. కానీ అతడు అనేక ఇతర సాంప్రదాయ, ఆధునిక వాయిద్య పరికరాలను కూడా వాయించాడు. భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆయన చాలా విభిన్నమైన మార్గాలను ఎంచుకునేవాడు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో ఇచ్చే ”జపనీస్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు 2022” క్వోటో ప్రైజ్‌ను స్వీకరించిన సభలో ఆయన మాట్లాడిన మాటలు.. భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆయన ఎంచుకున్న మార్గాన్ని మనకు తెలుపుతాయి. మన సంగీతాన్ని వీలైనన్ని విభిన్న సంగీత భాషల్లో ఎలా మాట్లాడాలో మనం నేర్చుకోవాలి అంటారాయన. సంగీతం అనేది ప్రజల మధ్యన జరిగే సంభాషణ. ఇది అన్ని మతాలను, అన్ని వర్గాలను, అన్ని ఇతర జీవన విధానాలను అధిగమించే ప్రక్రియ. ఇది తనకు తానుగా జీవించే ప్రక్రియ అంటారు జాకీర్‌ హుస్సేన్‌.
ప్రపంచంలోని సంగీతకారులు, కళాకారులు సంగీతంతో సంభాషించుకున్నట్టే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు పరస్పరం సంభాషించుకోడానికి పూనుకుంటే మనం గొప్ప శాంతి గ్రహంలో ఉంటామని అంటారాయన. చిన్నప్పుడు కుండలు గిన్నెలపై వాయించిన జాకీర్‌ ఏడేండ్ల వయసులో అతని తండ్రి దగ్గర విద్యార్థిగా మారి ప్రదర్శనలు ఇచ్చాడు. పండిట్‌ రవిశంకర్‌ బందంలో దీర్ఘకాలికంగా కొనసాగిన తబలా విద్వాంసుడు వారి తండ్రి అల్లారఖా.
జాకీర్‌ ప్రతిరోజు తెల్లవారుజామున లేచి మూడు గంటల పాటు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని సాధన చేసేవాడు. మదర్సాలో ఖురాన్‌ చదివేవాడు. చర్చిలో గీతాలు పాడేవాడు. ఒక మసీదు సమీపంలో కవ్వాలి పాడే ఒక సూఫీ గీతాలను వినేవాడు. 12 ఏండ్ల వయసులోనే తన మొదటి కచేరి ఇచ్చాడు. భారతీయ చలనచిత్రానికి సంగీతాన్ని కూర్చాడు. తన 18 వ ఏట యు.ఎస్‌.లో రవిశంకర్‌ బృందంలో పాల్గొన్నాడు.
సంగీతకారుడు ఎప్పుడూ మంచి శ్రోతగా ఉండాలంటారాయన. తద్వారా వారు ఎప్పటికప్పుడు తమ ప్రతిభను సాన పెట్టుకోవచ్చును అంటాడు. పండిట్‌ రవిశంకర్‌తో పనిచేసేటప్పుడు సంగీత రీతులను తెలుసుకోవడానికి ఆయన ఆల్బమ్‌లను పదేపదే వినేవాడు. ‘ఆయన లోతులను నేను తెలుసుకుంటేనే ఆయనకు సరైన వాయిద్య సహకారాన్ని అందించగలను. ఆయనను నేను విన్నప్పుడే ఆయనకు ఏం కావాలో నాకు తెలుస్తుంది’ అంటారు జాకీర్‌ జాకీర్‌ హుస్సేన్‌. ఆయన కాలంలో ఎదిగివచ్చిన అనేకమంది యువ సంగీతకారుల పట్ల ఆయనకు ప్రగాఢమైన విశ్వాసం ఉండేది. వాళ్లు ఎదిగివస్తున్న ప్రపంచ టెక్నాలజీని తమకు అనుగుణంగా మలుచుకుని కంప్యూటర్ల ద్వారా వివిధ ప్రయోగాలతో ఏదైనా సంగీత సంప్రదాయానికి తమ సంగీత పరిజ్ఞానాన్ని యాక్సెస్‌ చేసి కొత్త రీతులను సష్టించగలరు. భారతీయ సంగీతాన్ని వాళ్లు కొత్త పుంతలతో మరింత విశ్వవ్యాప్తం చేయగలరని తన విశ్వాసాన్ని ప్రకటించేవాడు.
సంగీతం మనసు లగం చేయవలసిన గొప్ప ఏకాగ్రతతో కూడిన ధ్యానం, ప్రయివేటు సమావేశాలు, కార్పొరేట్‌ సంస్థల ఈవెంట్లలో, లేదా వివాహాల విందుల సమయాల్లో వినవలసింది కాదు సంగీతం అంటే అంటారు జాకీర్‌. అందుకే ఆయన సంగీత కచేరీలకు హాలు తలుపులు మూసిన తర్వాత ఆలస్యంగా వచ్చేవారిని అనుమతించవద్దని చెప్పేవారు.
సంగీత పిపాసవున్న రసజ్ఞులైన ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఆయనను సామాన్య ప్రేక్షకుడికి దగ్గరగా చేర్చింది. 1988లో వచ్చిన 33 సెకండ్ల వ్యాపార ప్రకటన. అది తాజ్‌ తేయాకు పొడికి సంబంధించిన ఒక ప్రకటన.. హరీష్‌ బీమాని వాయిస్‌ ఓవర్‌లో.. జాకీర్‌ తబలా సంగీతానికి వాహ్ ఉస్తాద్‌ అని అంటే.. వెంటనే జాకీర్‌ ‘అరే హుజూర్‌.. వాహ్ తాజ్‌ భోలియే’ అంటాడు. అప్పట్లో ‘వాహ్ తాజ్‌’ అనేది తరచుగా ఉపయోగించే పదంగా మారిపోయింది. అది ఇప్పటికీ భారతీయులందరి మదిలో పలుకుతూనే ఉంది.
ఆయన సంగీతానికి, ప్రతిభకు ఎంతో తోడ్పాటు అందించింది ఆయన సహచరి ”ఆంటోనియా మిన్నే కొలా” 1978లో భారతీయ శాస్త్రీయ కథక్‌ నత్యకారిణి అయిన ఆంటోనియా మిన్నేకొలను వివాహం చేసుకున్నారు. ఆమె ఒక ఇటాలియన్‌ అమెరికన్‌. ఆమె ప్రముఖ కథక్‌ నత్యకారిణి సితారా దేవి వద్ద శిక్షణ పొందారు. జాకీర్‌ దంపతులకు ఇద్దరు కూతుళ్లు అనిషా ఖురేసి, ఈసాబెల్లా ఖురేసి.
ఆయన నటుడుగా కూడా కొన్ని చలనచిత్రాల్లో కూడా నటించాడు. షబానా ఆజ్మీ సరసన ‘సాజ్‌’ లో నటించారు. మర్చంట్‌ ఐవరి ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ వారి ”హీట్‌ అండ్‌ డస్ట్‌”, ”ద పర్ఫెక్ట్‌ మర్డర్‌” లాంటి సినిమాల్లో కూడా నటించారు.
నాలుగు గ్రామీ అవార్డులతో పాటుగా పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌, సంగీత నాటక అకాడమీ అవార్డు, యు.ఎస్‌.ఏ నేషనల్‌ హెరిటేజ్‌ ఫెల్లోషిప్‌, ఫ్రాన్స్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అవార్డు లాంటి అనేక గౌరవాలను ఆయన పొందారు. ‘నస్రీన్‌ మున్ని కబీర్‌’తో ఆయన సంభాషణలు ‘జాకీర్‌ హుస్సేన్‌ ఏ లైఫ్‌ ఇన్‌ మ్యూజిక్‌’ పేరున పుస్తకంగా వచ్చింది.
1951లో ముంబైలో జన్మించిన జాకీర్‌ హుస్సేన్‌ ప్రపంచ సంగీత సామ్రాజ్యంలో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలోకి తీసుకెళ్లి, తన అసమాన నైపుణ్యంతో ప్రపంచ సంగీతజ్ఞుల గుండెల్లో చెరగని ముద్ర వేసి డిసెంబర్‌ 15, 2024న శ్యాన్‌ ఫ్రాన్సిస్కోలో ఊపిరితిత్తుల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన సంగీత వాయిద్య ప్రతిభ గుర్తొచ్చినప్పుడల్లా భారతీయుల హదయం ‘వాహ్ ఉస్తాద్‌’ అంటూ మూలుగుతూనే ఉంటుంది.
– డా. చెమన్‌