వన్డేలకు స్టోయినిస్‌ వీడ్కోలు

Stoinis farewell to ODIs– ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ అనూహ్య నిర్ణయం
మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా):
ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ముంగిట ఆస్ట్రేలియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం కాగా.. ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ అనూహ్యంగా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆస్ట్రేలియా చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో స్టోయినిస్‌ సభ్యుడు. ఇటీవల ఎస్‌ఏ20లో డర్బన్‌ జెయింట్స్‌ తరఫున ఆడిన స్టోయినిస్‌ గాయం బారిన పడ్డ్డాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఆసీస్‌ జట్టు ద్వీపదేశానికి బయల్దేరాల్సి ఉండగా.. స్టోయినిస్‌ వీడ్కోలు ప్రకటన చేయటం గమనార్హం. 35 ఏండ్ల స్టోయినిస్‌ 71 వన్డేల్లో 26.69 సగటుతో 1495 పరుగులు చేశాడు. 2017 ఆక్లాండ్‌ వన్డేలో న్యూజిలాండ్‌పై అజేయ 146 శతక ఇన్నింగ్స్‌ స్టోయినిస్‌ కెరీర్‌ అత్యుత్తమం. స్టోయినిస్‌ 43.12 సగటుతో 48 వికెట్లు సైతం తీసుకున్నాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌ విజయంలో మార్కస్‌ స్టోయినిస్‌ కీలక భూమిక పోషించాడు. వన్డేలకు దూరమైనా.. టీ20 ఫార్మాట్‌లో కొనసాగుతానని స్టోయినిస్‌ తెలిపాడు. ‘ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించటం నమ్మశక్యం కాని ప్రయాణం. జాతీయ జట్టు తరఫున ఆడిన ప్రతి క్షణం గొప్పగా భావించాను. ఈ నిర్ణయం అంత సులువు కాదు. కానీ వన్డేల నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయం అనిపించింది. ఇక నుంచి నా ఫోకస్‌ పూర్తిగా టీ20 ఫార్మాట్‌పైనే కొనసాగుతుంది’ అని మార్కస్‌ స్టోయినిస్‌ వెల్లడించాడు.