కరీంనగర్‌లో కడుపు కోతలే…

Stomach incisions in Karimnagar...– ప్రయివేటులో 10శాతమే సాధారణ కాన్పులు, 90శాతం సిజేరియన్లు
– ఏడాది కిందట తూతూమంత్రంగా నోటీసులు, హెచ్చరికలు
– మళ్లీ యథాస్థితికి చేరిన ప్రయివేటు ఆస్పత్రుల దందా..
– అదే ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన సాధారణ ప్రసవాలు
– సర్కారులో నార్మల్‌ డెలివరీలు 35శాతంగా ఉంటే.. 65శాతంలోపే శస్త్రచికిత్సలు..
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రయివేటు వైద్యుల కాసుల కక్కుర్తి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా అధిక ఫీజుపై ఆశతో ఎడాపెడా ‘కోత’లు పెడుతున్నారు. పీఆర్‌ఓలు, ఇతర సిబ్బందిని నియమించుకుని మరీ ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. సాధారణ ప్రసవం కష్టమనే సంకేతాలు ముందే ఇస్తుండటంతో ఎలాగూ సిజేరియన్‌ తప్పదన్న భావనకు భార్యాభర్తలు వస్తున్నారు. అందులోనూ మంచి ముహూర్తంలో బిడ్డకు జన్మనివ్వాలనే ఆలోచన.. తమ బిడ్డ పురిటి నొప్పులు భరించలేదనే భావనతోడై సిజేరియన్లు పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. రెండేండ్ల క్రితం వరకూ సిజేరియన్ల కేసుల్లో వరుసగా మూడేండ్లు టాప్‌గా నిలిచిన కరీంనగర్‌పై స్పెషల్‌పోకల్‌ పెట్టగా కొంత తగ్గుముఖం పట్టినట్టే కనిపించాయి. తీరా యథాస్థితికి చేరుకుని ముందు నుంచే సాధారణ ప్రసవం పట్ల జాగ్రత్తలు, సూచనలు చేయకుండా భయాన్ని చూపుతూ ‘ప్యాకేజీ’లు మాట్లాడుకుంటున్న తీరు కరీంనగర్‌ జిల్లాలో షరామమూలుగా మారిపోయింది.
కరీంనగర్‌ జిల్లా ప్రయివేటు ఆస్పత్రుల్లో 90శాతం సిజేరియన్‌ కేసులే నమోదవుతున్నాయని రాష్ట్ర ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ 2020 ఏప్రిల్‌ 5న నివేదిక ఇచ్చింది. అంతకుముందు 2019-2021 మధ్యకాలంలో సాగిన ప్రసవాల్లో కూడా కరీంనగర్‌లోనే అత్యధికంగా 82.4శాతం శాస్త్ర చికిత్స చేసినట్టుగా కౌన్సిల్‌ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ తన నివేదికలో తెలిపింది. ఆ ఏడాది కాలంలో జిల్లా మొత్తంగా 4510 ప్రసవాల సంఖ్య నమోదైతే అందులో 3258 కేసులు శస్త్రచికిత్సలే ఉండటం గమనార్హం. ఇలా మూడేండ్లు వరుసగా రాష్ట్రంలోనే సిజేరియన్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాగా పేరుకెక్కింది. దీనిపై సీరియన్‌గా దృష్టిసారించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ సహా సంబంధిత శాఖ అధికారులను హెచ్చరించింది. సిజేరియన్ల కేసులు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి కలెక్టర్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మరీ ప్రయివేటు ఆస్పత్రులపై నిఘా పెంచారు. సాధారణ ప్రసవాల పెంపునకు కొంత ప్రయత్నమూ చేశారు. దాని కొనసాగింపును తరువాత వచ్చిన కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సైతం పర్యవేక్షించారు. ఫలితంగా ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య ఆమాంతం పెరిగిందిగానీ ప్రయివేటు నెమ్మదించింది. తీరా ఈ ఆర్నెళ్లకాలంలో మరింత ప్రయివేటులో కోతల సంఖ్య మరింతగా పెరిగింది.
పీఆర్‌ఓల ద్వారా ప్యాకేజీ, కమీషన్ల కక్కుర్తితో సిజేరియన్లు
కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, ఉమ్మనీరు తాగి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్‌ చేయాలి. కానీ చాలామంది వైద్యులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. కరీంనగర్‌ జిల్లాలో ప్రయివేటు దవాఖానాలు గ్రామాల్లోని ఆర్‌ఎంపీలు, పీఎంపీలను మధ్యవర్తులుగా పెట్టుకుని ఒకచైన్‌సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తల సలహాలు, సూచనలతో 9 నెలల వరకు పౌష్టికాహారం అందుకుని ప్రభుత్వాస్పత్రికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారిలో అకస్మాత్తుగా నొప్పులు రాగానే కొందరు హడావిడిగా ప్రయివేటుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రజల భయాలను, ఆందోళనలను గుర్తిస్తున్న ఆర్‌ఎంపీలు చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నారు. అప్పటికే ఆయా దవాఖానాలతో ఒప్పందాలు చేసుకోవడంతో పీఆర్వోల ద్వారా ఆపరేషన్లకు రికమండ్‌ చేసి ప్యాకేజీ కింద కమీషన్‌ పొందుతున్నారు. ఒక్కో కాన్పుకు రూ.50వేలు నుంచి రూ.70వేలు వరకు ఖర్చు అవుతుండగా ఇందులో 30శాతం కమీషన్ల కిందనే పోతున్నట్టు తెలుస్తోంది.
మూన్నెళ్ల గణాంకాలే నిదర్శనం..
తల్లుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్రయివేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పలుమార్లు ఆదేశాలు జారీ చేశారు. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ఆస్పత్రులను సీజ్‌ చేయడంతో పాటు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. అయితే కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగాయే తప్ప క్షేత్రస్థాయిలో ప్రయివేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ల సంఖ్య మరింత పెరిగింది. ఈ మూన్నెళ్ల కాలంలో జరిగిన ప్రసవాలను పరిశీలిస్తే గతేడాది నవంబర్‌ 1 నుంచి ఈ ఏడాది జనవరి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో 672 సాధారణప్రసవాలు జరిగితే 1304 శస్త్ర చికిత్సలు జరిగాయి. అదే ప్రయివేటు విషయానికొస్తే సాధారణ ప్రసవాలు కేవలం 131 మాత్రమే జరగగా ప్రయివేటులో 1068 సీజేరియన్లు చేశారు. మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1976 ప్రసవాలు జరిగితే అందులో 35శాతం నార్మల్‌ డెలివరీలు ఉంటే.. ప్రయివేటులో జరిగిన 1199 ప్రసవాల్లో కేవలం 10శాతమే సాధారణప్రసవాలు జరిగాయి.