దాడులు ఆపండి – సమస్య పరిష్కరించండి

Stop attacks - solve the problemఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం సుమారు మూడేండ్లుగా పోరా డుతున్న పేదలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పట్ల ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర మాసాలు దాటింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహబూబాబాద్‌లో గుడిసెల కేం ద్రం ధ్వంసం చేసారు. మరో వారం రోజుల్లోనే హన్మ కొండలో ఒక కేంద్రం ధ్వంసం చేసి నాయకులను అరెస్టు చేసారు. ఇండ్ల పట్టాల కోసం ఎదురుచూ స్తున్న గుడిసెవాసులకు ఈ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించాయి. కాంగ్రెస్‌ పార్టీ తమ ఎన్ని కల ప్రణాళికలో ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల పేరుతో మోసపోయిన పేదలు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వాగ్దానాలతో ఇండ్ల స్థలాలకు పట్టాలు వస్తాయని, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారని ఎదురుచూస్తున్నారు. నిజానికి బీఆర్‌ఎస్‌ పాలనా కాలంలో ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న గుడిసెవాసులకు రాష్ట్రంలో అనేకచోట్ల కాంగ్రెస్‌ నాయకులు మద్ద తునిచ్చారు. అదే కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో పేదల ఆశలు బలపడ్డాయి. రాష్ట్రంలో ఇండ్లు, ఇండ్లస్థలాలు లేని పేదలు 30లక్షల మంది ఉన్నారని గత ప్రభుత్వం ‘సమగ్ర కుటుం బ సర్వే’ ద్వారా తేల్చింది. దీని తీవ్రతను గమనించిన కాంగ్రెస్‌, ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది.
మహబూబాబాద్‌, హన్మకొండ ఘటనల తర్వాత సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకత్వ బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిని, గృహనిర్మాణ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించాలని కోరింది. అక్రమ కేసులన్నీ రద్దు చేయా లని, గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలివ్వాలని, ఇండ్లు కట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10లక్షలు సహాయం చేయాలని సీపీఐ(ఎం) కోరింది. కేసులు రద్దు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు. ఇండ్ల స్థలాలు కూడా తప్పకుండా ఇస్తామని చెప్పారు. మరోవైపు జగిత్యా లలోను, కోరుట్లలోను మరింత పకడ్బందీగా పోలీసులు దాడులు చేసారు. అర్ధరాత్రి నాయకులను, కార్యకర్తలను ఇండ్లలో నిద్రలేపి అరెస్టులు చేసారు. అదే సమయంలో గుడిసెల కేంద్రాలను జెసిబి లతో నేలమట్టం చేసారు. పేదల డబ్బులు, సామాన్లు ఏమైనాయో తెలియటంలేదు. అరెస్టు చేసిన నాయకుల మీద మాత్రం హత్యా యత్నం వంటి నేరాలను కూడా మోపారు. పలుకుబడి కలిగిన భూకబ్జాదారులు, రియలెస్టేట్‌ బ్రోకర్లతో కుమ్మక్కైన పోలీసులు, రెవిన్యూ అధికారులు ఈ దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగలేదు. తరువాత పెద్దపల్లిలో కూడా నాలుగు గుడిసెల కేంద్రా లను ధ్వంసం చేసేందుకు పథక రచన చేసారు. జగిత్యాల, కోరుట్లలో 21మంది మీద హత్యాయత్నం నేరం మో పారు. ఆరుగురిని 22 రోజులపాటు, మరో ముగ్గురిని 38 రోజుల పాటు జైలుకు పంపారు. బెయిల్‌ మీద బయటికి రాకుండా కేసు తర్వాత కేసు మోపేందుకు ప్రయత్నించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు లెల్లెల బాలకృష్ణ, మరో నలుగురు మహిళలతో పాటు 9మందిని జైలుపాలు చేసారు. పరిస్థితి తీవ్రతను పదేపదే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సీపీఐ(ఎం) తెచ్చింది. ముఖ్యమంత్రితో మూడుసార్లు, గృహనిర్మాణ శాఖ మంత్రితో రెండుసార్లు చర్చించింది. మూడేండ్ల పోరా టంలో బీఆర్‌ఎస్‌ నాయకత్వం పెట్టిన కేసులు ఎత్తివే యవలసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ పాలనలో కూడా కేసులు పెట్టడం సరైంది కాదని చెప్పింది. ఈ అన్ని సందర్భాలల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ ఆచరణలో కేసులు ఇంకా రద్దు కాకపోగా కొత్తగా కేసులు పెట్టారు. భూ పోరాట సందర్భంగా ఈ మూడేండ్లలో మొత్తం 717మంది మీద 79 కేసులు బనాయించారు. పేదల ఇండ్ల కోసం పోరాడుతున్న నాయకుల మీద హత్యాయత్నం నేరం మోపటం అధికారుల దుర్భుద్దిని సూచిస్తున్నది. ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ఈ కేసులను తక్షణం రద్దు చేయటం సమంజసం.
కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే బస్తీలు, గ్రామాలలో వారం రోజులపాటు అధికారులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీక రించారు. ఒకే అప్లికేషన్‌లో అనేక సమస్యల ప్రస్తావనకు అవ కాశం ఇచ్చారు. కానీ ఇండ్ల స్థలాల సమస్య ఆ లిస్టులో లేదు. సహజంగానే గుడిసెవాసులకు ఆందోళన కలిగించే విష యం. అందుకే తహశీల్దార్‌ కార్యాలయంలో ఇండ్ల స్థలాల కోసం పేదలు పెట్టుకున్న దరఖాస్తులన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.
మూడేండ్లుగా ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం సాగుతున్న పోరా టం అనేక నిర్బంధాలను చవిచూసింది. జక్కలొద్ది తదితర కేంద్రా లలో రౌడీమూకల దాడులను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఒకవైపు ఎన్నికల క్యాంపెయిన్‌ జరుగుతుండగానే మహబూబాబాద్‌ లో 18వ సారి గుడిసెల కేంద్రాన్ని ధ్వంసం చేసారు. 10మంది మహిళలను పోలీస్‌స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టి జైలుపాలు చేసారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 19వసారి కూడా ధ్వంసం చేసారు. వరంగల్‌లోని జక్కలొద్ది (ప్రగతినగర్‌) కేంద్రం మీద కూడా ఎన్నికల క్యాంపెయిన్‌ సమయంలోనే బీఆర్‌ఎస్‌కు చెందిన శాసనసభ్యుడు రౌడీమూకలను ఎగదోసి దాడులు చేయిం చాడు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న కొండా సురేఖ పేదలకు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు. సహజం గానే పేదలకు న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్నారు.
భూపోరాట కేంద్రాల గురించి అధికారులు, రియలెస్టేట్‌ బ్రోకర్లతో కుమ్ముక్కై అనేకచోట్ల దుష్ప్రచారం చేస్తున్నారు. ఇండ్ల స్థలాల పేరుతో కొందరు డబ్బు వసూళ్లు చేసుకుంటున్నారని, ప్లాట్లు అమ్ముకుంటున్నారని నిందలు మోపుతున్నారు. ఇండ్లు ఉన్న పేదలు కూడా మళ్లీ గుడిసెలు వేస్తున్నారనీ, అమ్ముకోవడం కోసమే ఈపని చేస్తున్నారనీ, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి గుడిసెలు వేస్తున్నారనీ ఆరోపిస్తున్నారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని సీపీఐ(ఎం) సవాల్‌ చేసింది. ఇల్లు లేని పేదలు ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఆశ పడి గుడిసెలు వేసుకోవచ్చు. ఎవరి జిల్లాలో వారికి ఇండ్ల స్థలాలకు పట్టాలు లేదా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఈ సమస్య రాదు కదా! పైగా అర్హులకే ఇవ్వాలని సీపీఐ(ఎం) స్పష్టంగా కోరింది. ఇక అనర్హుల సమస్య ఎందుకొస్తుంది? కొన్నిచోట్ల అధికారులు మరికొన్ని వాద నలు చేస్తున్నారు. జిల్లాలో కూడా ఆ పట్టణం వారికే లేదా ఆ మం డలం వారికే పట్టాలు ఇస్తామని అంటున్నారు. ఇది అర్ధరహితం. వ్యవసాయేతర పనుల కోసం గ్రామీణ పేదలు పట్టణాలకు వల సలు పోతున్నారు. సహజంగానే అక్కడ స్థిరపడుతున్నారు. వారికి ఇండ్ల స్థలాలు కేటాయించడం ప్రభుత్వ బాధ్యత. చెట్లు, పొదలు, చెత్తాచెదారం తొలగించి ఊరవతల గుడిసెలు వేసుకున్న పేదలు పాములు, తేళ్ళతో సహజీవనం చేస్తున్నారు. మంచి నీరు, కరెంటు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు లేక సతమత మవుతున్నారు. పసిపిల్లలు, వృద్ధులు అనేక ఇబ్బందుల పాల వుతున్నారు. ఎన్నికల సమయంలో అనేకమంది నాయకులు ఈ గుడిసెవాసుల ఓట్ల కోసం వచ్చారు. ఈ పేదలను ఓట ర్లుగా చూసిన నాయకులు వీరిని మనుషులుగా కూడా చూడాలి. వారికి మునిసిపల్‌, గ్రామపంచాయతీ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించాలి.
ఇప్పటికే ఓటమిని ఊహించని బీఆర్‌ఎస్‌ నాయకత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినరోజు నుంచే శాపనార్ధాలు పెట్ట డం మొదలుపెట్టింది. ఆరు గ్యారంటీల అమలు కోసం వంద రోజులు కూడా ఓపిక పట్టకుండా అసహనం ప్రదర్శించింది. ప్రజలు దీనిని అంగీకరించలేదు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట నిలబెట్టుకోవాలి. గృహ నిర్మాణ శాఖమంత్రి ని సీపీఐ(ఎం) నాయకత్వం కలిసినప్పుడు సంక్రాంతి దాటగానే ఇం డ్లస్థలాలు కేటాయిస్తామని చెప్పారు. తక్షణం గుడిసెలు వేసుకున్న పేదలకు అక్కడే స్థలం కేటాయించి పట్టాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. పౌరులందరికీ ఇంటి వసతి జీవించే హక్కులో భాగమని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. జీవించే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. అందుకే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇండ్లు, ఇండ్లస్థలాల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి.
ఎస్‌. వీరయ్య